సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను గద్దె దించాలని తెలంగాణ సమాజం కాంగ్రెస్‌నే ఎంచుకుందని.. అందుకే బీజేపీని వీడి తాను సొంతగూటికి వెళ్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ మార్పుపై స్పందించారు. రాష్ట్రంలో అవినీతిపై కేంద్రం దృష్టి సారించకపోవడమే తాను పార్టీ మారేందుకు ప్రధాన కారణమని అన్నారాయన.
‘‘తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ రెండుసార్లు ఓడింది. కాంగ్రెస్ నాయకత్వ తప్పుడు నిర్ణయాలతో రెండుసార్లు ఓడాం. కానీ, తెలంగాణ సమాజం కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్‌ను ఎంచుకుంది. ప్రజల అభీష్టం మేరకే నేను పార్టీ మారుతున్నా’’ అని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
డబ్బుతో నన్ను ఓడించారు
కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలనే నా పోరాటం మొదలుపెట్టాను.తెలంగాణ ఉధ్యమం లో ఎంపీ గా నేను ఎంతో కృషి చేశా. కానీ,తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఎంపిక లో జరిగిన కొన్ని తప్పుల వల్ల పార్టీ కి నష్టం జరిగింది. 12 మంది కాంగ్రెస్ సభ్యుల్ని లాక్కుని ప్రతిపక్షం గొంతు లేకుండా చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడ్డ తర్వాత కేసీఆర్ ను గద్దె దీంచేది బీజేపీ అని నేను నమ్మి బీజేపీ లో చేరా. మునుగోడు లో నన్ను ప్రజలు గెలిపించాలనుకున్నా. కానీ, కేసీఆర్ డబ్బుతో, అధికార దుర్వినియోగంతో నన్ను ఓడించారు అని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.
బీజేపీ బలహీనపడడమే కాదు..
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీ అధిష్టాన నిర్ణయాలతో పార్టీ బలహీనపడింది. బీజేపీ నాయకత్వానికి పలు సూచనలు కూడా చేశా. దేశంలోనే అత్యంత అవినీతిపరమైన ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ అవినీతి పై విచారణ చేస్తారని నమ్మి బీజేపీ లో చేరాను. కానీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కేసీఆర్‌ను గద్దె దించి.. ఆయన కుటుంబాన్ని జైలుకు పంపుతారని భావించా. కానీ, అలా జరగలేదు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనన్న భావన వచ్చింది. మోదీ, అమిత్ షా అంటే నాకు గౌరవం ఉంది. తుదిశ్వాస వరకు బీజేపీ లో ఉండాలనుకున్నా.. కానీ కుదరడం లేదు. తెలంగాణ లో కేసీఆర్ ను గద్దెదించేందుకు ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ లో పరిస్థితులు మారాయి. అందుకే పార్టీ మార్పు పై నేను స్పష్టమైన ప్రకటన చేశాను. డబ్బులు, కాంట్రాక్టుల కోసం నేను చూడను. అమ్ముడుపోయే వ్యక్తిని అయితే.. మళ్లీ పార్టీ ఎందుకు మారతాను? అని విమర్శలకు కౌంటర్ ఇచ్చారాయన.
నాకు ఎల్బీనగర్, మునుగోడు టిక్కెట్ ఇస్తామని బీజేపీ చెప్పింది. కానీ, నేను బీజేపీ లో ఉన్నా పోరాడుతా కానీ పోటీ చేయ అని చెప్పా. ఇంతకు ముందు.. నేను పార్టీ మారే సమయంలో రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. ఆ తర్వాత.. రాజగోపాల్ రెడ్డి వస్తా అంటే ఓక మెట్టు దిగుతా బహిరంగంగా ప్రకటించారాయన. రాబోయే ఎన్నికల్లో మనుగోడు నుంచే పోటీ చేస్తా. ప్రాణం ఉన్నంతవరకు మునుగోడులోనే ఉంటా. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే.. కేసీఆర్‌పైనా పోటీచేస్తా. బీఆర్‌ఎస్‌ను ఓడించడం కాంగ్రెస్‌కే సాధ్యం అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment