ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు.. మాజీ మంత్రి లోకేష్ లు చేస్తున్న ప్రకటనలు వాళ్ల నిరాశ,నిస్పృహలు తెలియచేస్తున్నట్లుగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పైనా ఏదో ఒక విమర్శ చేసి ప్రజలలో ఉండాలన్నది ఆ ఇద్దరి లక్ష్యంగా కనబడుతోంది. చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలను ఉటంకించడం, లోకేష్ గతంలో కొందరు యువతులతో విలాసంగా గడిపిన చిత్రాలపై స్పందించిన తీరును చూస్తుంటే.. టీడీపీలో సరైన సలహాదారులు లేరన్న విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనవచ్చని అన్నారట. దానికి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలనూ ప్రాతిపదికగా తీసుకున్నారు. నిజంగానే కేసీఆర్ చెప్పిన మాటలన్నిటింని చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారా?..అన్నది కూడా ఆలోచించాలి కదా. కొంతకాలం క్రితం చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ ఏమన్నారు?.
చంద్రబాబు అంతటి డర్టీ పొలిటీషియన్ ఈ దేశంలోనే లేరని అన్నారు. దీనికి కూడా చంద్రబాబు అంగీకరిస్తే, ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఓకే చేయవచ్చు. మరి అందుకు చంద్రబాబు రెడీనా?. కేసీఆర్ ఒక్కరే కాదు.. మంత్రులు హరీష్ రావు, కేటిఆర్ వంటివారు ఈ మధ్యకాలంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని విమర్శించడానికి చంద్రబాబు పేరునే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబే తెలంగాణలో కాంగ్రెస్‌ను నడిపిస్తున్నారని, వ్యవసాయం దండగని.. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వరాదని చంద్రబాబు అనేవారని, ఇప్పుడు దానిని ఆయన శిష్యుడు రేవంత్ ఫాలో అవుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై కూడా ఆయన స్పందిస్తారా!
✍️మరోవైపు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో విద్యా వ్యవస్థ చాలా బాగా నడుస్తోందని, తెలంగాణలో దారుణంగా ఉందని స్వయంగా కేసీఆర్ మనుమడే చెప్పారని పేర్కొన్నారు. ఆ విషయాన్ని కూడా చంద్రబాబు ఒప్పుకుంటారా?. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీలో వైద్యరంగం బాగా నడుస్తోందని, స్కూళ్లను బాగు చేస్తున్నారని పేదలకు ఆరోగ్యశ్రీ సమర్దంగా అమలు చేస్తున్నారని చెప్పారు. అలా.. చంద్రబాబు తనకు తెలియకుండానే తనను తానే తప్పు పట్టుకుంటున్నారు.
✍️ చంద్రబాబు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని వదలి ఓటుకు నోటు కేసు పుణ్యమా అని విజయవాడ వచ్చేశారో అప్పటి నుంచే ఏపీలో భూముల రేట్లు పడిపోయాయి. దానికి కారణం ఏమిటంటే అమరావతి పేరుతో 29 గ్రామాలలోనే అన్నీ వ్యయం చేస్తానని చంద్రబాబు ప్రకటించడమే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల భూములను గ్రీన్ జోన్ గా ప్రకటించారు. దాంతో కృష్ణ,గుంటూరు జిల్లాలలో భూముల విలువలు పడిపోయాయి. ఆ సంగతి ఆయన మర్చిపోయి ఉండవచ్చు. జగన్ వచ్చాక కొత్తగా భూముల ధరలు పడలేదు. పైగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా గతంలో కన్నా ఆదాయం పెరిగింది. అంటే దాని అర్దం రిజిస్ట్రేషన్ లావాదేవీలు సాగుతున్నట్లే కదా!
టమోట ధరలు పెరిగిపోవడానికి కారణం ప్రభుత్వమేనని చంద్రబాబు తేల్చేశారు. ఇక్కడ గంజాయి మాత్రమే పండుతోందని ఏపీ రైతులను చంద్రబాబు అవమానిస్తున్నారు. ఏపీలో టమోటా ధరలు పెరిగితే రైతులకు మేలే జరిగింది కదా? దానికి కూడా ఈయన బాధపడితే ఎవరు తీర్చాలి. మహారాష్ట్ర, తెలంగాణ,కర్నాటక రాష్ట్రాలలో కూడా టమోటా ధరలు బాగా పెరిగాయి. ఉత్తరాది రాష్ట్రాలలో టమోటా ధర కిలో 150 రూపాయల వరకు వెళ్లింది. అందుకు కూడా జగనే కారణమా?. అయినా ఏపీ ప్రభుత్వం కిలో ఏభై రూపాయలకే ప్రజలకు టమోటా అందచేసేందుకు కృషి చేస్తోంది కదా! బాబు టైమ్ లో టమోటా రైతులకు మేలు చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా?..
✍️ రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలయ్యాయని మరో ఆరోపణ చేశారు. ఇందులో అర్దం ఏమైనా ఉందా?రైతులపై అప్పుల భారం మోపారట. రైతులకు అధికంగా అప్పులు ఇవ్వాలని కోరేది రాజకీయ నేతలే కదా? తీరా ఇచ్చాక వారిపై అప్పులు పెరిగాయని అనేది వీరేనన్నమాట. రైతుల ఆర్థిక స్థితిగతులను బట్టే బ్యాంకులు అప్పులు ఇస్తుంటాయన్న సంగతి ఆయనకి తెలియకపోతే ఏమి చేస్తాం?. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని మరోసారి ఆక్షేపించి తన పెత్తందారీ మనస్తత్వాన్ని చంద్రబాబు బయటపెట్టుకున్నారు. ఈనాడులో వచ్చే వార్తలనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చెబుతుంటారు. వారు ఈ మద్య తెలంగాణలో ఆహో,ఓహో అంటూ ఎపిలో వార్తలు ఇస్తున్నారు. వారి ఉద్దేశం తెలంగాణతో పోల్చి ఏపీని అవమానించడమే. వీటిలో కూడా పచ్చి అబద్దాలు రాస్తున్నారు. హైదరాబాద్ లో రెండు లక్షల సిసి కెమెరాలు ఉన్నాయట. ఏపీలో ఎందుకు లేవని ఈనాడు పిచ్చి ప్రశ్న వేసింది. ఇదంతా తప్పుడు ప్రచారంలో భాగమే.
✍️హైదరాబాద్‌తో ఏ నగరాన్ని అయినా పోల్చగలమా?ఆ మాటకు వస్తే భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ రోడ్లన్ని చెరువులుగా మారుతున్నాయని, ట్రాఫిక్ నరకం చూపెడుతోందన్న విమర్శలు ఉన్నాయి. దాని గురించి కూడా రాయాలి కదా!. హైదరాబాద్ కు పోటీగా విశాఖ అయితే బాగుంటుందని జగన్ చెబితే ఇదే ఈనాడు అందుకు మాత్రం ఒప్పుకోదు. ఏపీ అనేక రంగాలలో నంబర్ ఒన్ గా వచ్చిందని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. వాటి గురించి ఎందుకు చెప్పరు. ఏపీలో అమ్మ ఒడి ద్వారా లక్షల మంది తల్లుల ఖాతాలలో డబ్బులు వేస్తున్నారు. ఏపీలో పేదలకు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదని వీరు ప్రశ్నించరే. ఏఈపిలో పరిశ్రమలు పెట్టడానికి అంబానీ, అదానీలు తరలివచ్చారు. తెలంగాణకు వారిద్దరూ ఎందుకు వెళ్లలేదని అడగరే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయినా ఏ రాష్ట్ర ప్రత్యేకతలు వారికి ఉంటాయి. పోల్చి రాయవచ్చు.కాని అది రెండు వైపులా ఉండాలి. కానీ, జగన్ పై ద్వేషంతో రాయడం దుర్మార్గం.
✍️ ఇక యువగళం పాదయాత్రికుడు లోకేష్ మరింత చిత్రమైన ప్రటనలు చేస్తున్నారు. ఆయనేదో రెడ్ బుక్ పెట్టుకున్నారట. అందులో అధికారుల పేర్లు రాసుకుని ఆయన ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చూస్తారట. అంటే తమ ప్రభుత్వం వస్తే ఎంత అధ్వాన్నంగా బిహేవ్ చేయబోతుందో అనేది ఇప్పటినుంచే చెబుతున్నారన్నమాట.ఇక ఆయన కొందరు యువతులతో విలాసంగా గడిపిన ఘట్టాల ఫోటోల గురించి మాట్లాడుతూ.. కావాలంటే వీడియోలు కూడా పంపుతానని అన్నారంటే ఆయన సభ్యత ఆ రకంగా ఉందని అనుకోవాలి.
ప్రజా జీవితంలో ఉన్న నారా లోకేష్ లాంటి వాళ్లు ఇలాంటి వాటికి ఏమని చెప్పాలి. విద్యార్ధి దశలో తెలియక తాను ఏదో పార్టీలో అలా పాల్గొన్నానని, ఇకపై అలాంటివి జరగవని చెప్పవలసింది పోయి, ప్రస్తుతం యువత అలాంటివి చేయడం తప్పు లేదన్నట్లుగా మాట్లాడడమే కాకుండా వీడియోలు పంపుతానని అనడం అహంభావమో, అజ్ఞానమో తెలియదు. ముందుగా ఆ వీడియోలను తన పార్టీకి చెందిన మహిళలకు, కార్యకర్తలకు పంపి వారి ఫీడ్ బ్యాక్ తీసుకోమని చెప్పండి. వారంతా ఆ ఫొటోలు చూసి సంతోషపడితే ఊరూరా వాల్ పోస్టర్లు వేసుకోమనండి. లేదా తప్పని చెబితే సారీ చెప్పి ,తాను మారానని,ఇకపై ఆలా చేయనని చెప్పమనండి. ఏది ఏమైనా వీరికి ఎవరు సలహాలు ఇస్తున్నారో కాని, అవన్నీ వారిని ఆత్మరక్షణలో పడేస్తున్నాయని చెప్పకతప్పదు.
::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment