స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో జైలుకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రక్షించుకోవడానికి, ఈ అరెస్టు సాకుతో సానుభూతి సంపాదించడానికి తెలుగుదేశం పార్టీ కన్నా, ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవీ 5 వంటివి తెగ తాపత్రయపడుతున్నాయి. చంద్రబాబు రాజకీయ జీవితానికి కష్టం వస్తే, అది తమ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరమని భయపడుతున్న ఈ మీడియా సంస్థలు ఈ స్కామ్‌లో అసలు అవినీతే జరగలేదని ప్రచారం చేయడానికి నానాపాట్లు పడుతున్నాయి.
ఇంట్లో ఉంటానని అడగడం ఆశ్చర్యమే
చంద్రబాబు తప్పే చేయలేదని ప్రజలు భ్రమపడాలన్న లక్ష్యంతో వీరే తీర్పులు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టాలని ఎవరూ అనరు. ఏపీ సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చినట్లు అనిపిస్తుంది. చంద్రబాబు తరపు వాదనలు చూస్తుంటే అవి ఎంత డొల్లతనంగా ఉన్నాయో అర్ధం అవుతుంది. కేవలం సాంకేతిక అంశాలే తప్ప, కేసు వివరాలలోకి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు. అంత సీనియర్ నేత, ఎన్నో చట్టాలు తెచ్చానని చెప్పే ఆయన తాను జైలులో ఉండనని, ఇంట్లో ఉంటానని అడగమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
లాయర్లకు ఈ విషయం తెలియదా?
చట్టంలో ఎక్కడైనా ఆ సదుపాయం ఉందా? లేదా? అన్నది చూసుకోకుండా, అందులోను ఏసీబీ కోర్టు పరిధిలోకి ఆ విషయం వస్తుందా? రాదా? అన్న సంగతి గమనించకుండా సంబంధిత పిటిషన్ వేయడమే గమ్మత్తుగా ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన అంత పెద్ద లాయర్లు, కోట్లు తీసుకునే ఆ లాయర్లకు ఈ విషయం తెలియదా? తెలిసినా కావాలని ఒక ప్రయత్నం చేసి చూశారా? అన్నది తెలియదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రత ఉండదని, ఇంటిలో అయితే భద్రత ఉంటుందని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు.
చదవండి: చంద్రబాబు కేసులో అడుగడుగునా కేంద్ర దర్యాప్తు సంస్థలే
ఈ ఇంట్లో ఎలా భద్రత ఉంటుంది?
చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో ఎక్కడా రాజీపడకూడదు. అందులో సందేహం లేదు. కానీ నాలుగు ఎత్తైన గోడల మధ్య ఉండే జైలులో భద్రత లేకపోతే, ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయించి, అందులో ఒక ప్రత్యేక రూమ్ కేటాయిస్తేనే భద్రత లేకపోతే, కృష్ణా నది పక్కన కరకట్టపైన ఉండే ఇంటికి ఎలా భద్రత ఉంటుందో అర్ధం కాదు. చివరికి ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు అసలు స్కామే లేదన్న చందంగా ఆయా వ్యక్తులతో మాట్లాడించడం ఆరంభించారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కూడా దీనిపై స్పందించిన తీరులో కొన్ని అనుమానాలు వస్తున్నాయి.
నిధులు దుర్వినియోగం
తన నోట్ ఆధారంగానే కేసు పెట్టారని ప్రచారం జరుగుతోందని, అందులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏమీ లేదని చెప్పడానికి ఆయన యత్నించారు. ఆయన మాటల వైనం చూస్తే ప్లేట్ ఫిరాయించినట్లు అనిపిస్తుంది. ఇక్కడ డబ్బులు విడుదల అన్నది ఒక్క పాయింటే. ప్రతి అంశంలోను ముఖ్యమంత్రి డబ్బులు విడుదల చేయాలని కోరారని నోట్ పైల్స్‌లో రాస్తారా అన్నదానికి ఆయన జవాబు ఇచ్చి ఉండాల్సింది. నిధులు కేటాయించడం, విడుదల చేయడం సాధారణంగా జరిగి సద్వినియోగం అయితే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది అభియోగం.
ఎందుకు పారిపోయారు!
సీమెన్స్ సంస్థ అసలు ఈ లావాదేవీలతో సంబంధం లేదని చెప్పడం మరో అంశం. అలాగే చంద్రబాబు పీఎస్. శ్రీనివాస్, కన్సల్టెంట్ మనోజ్‌లు ఎందుకు విదేశాలకు పారిపోయారన్నది ఇంకో కోణం. వందల కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లాయన్నది ఆరోపణ. వీటన్నిటి గురించి రమేష్ ఏమీ మాట్లాడినట్లు అనిపించలేదు. అందువల్ల ఆయనది పూర్తి వివరణగా అనిపించలేదు. ఆయన ఏదో కంగారుపడుతూ మాట్లాడారా అన్న అభిప్రాయం వస్తుంది. ఆ తర్వాత డిజిటెక్ ఎండీతో, సీమెన్స్ తొలగించిన మాజీ ఎండీతో మాట్లాడించి అసలు స్కామే లేదని ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర టీడీపీ మీడియా సంస్థలు ప్రచారం చేశాయి.
నిజానికి వీరిద్దరు కూడా ఈ కేసులో నిందితులే.అరెస్టు అయినవారే. డిజిటెక్ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. అలాంటి వ్యక్తి ఇంటర్వ్యూలు ఇస్తే జనం నమ్మేస్తారా? అదే టైమ్‌లో సీమెన్స్ సంస్థ సీఐడీ వారికి పంపిన ఈమెయిల్ గురించి మాత్రం ఒక్క ముక్క రాయలేదు. నైపుణ్యాభివృద్ది సంస్థలో అవినీతి జరగలేదని చెప్పడానికి రామోజీరావు తదితరులు పడుతున్నట్లు పాట్లు గమనిస్తే ఈ కేసు ముందుకు వెళితే తమ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని వారు భయపడుతున్నట్లు అనిపిస్తుంది.
చదవండి: Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్.. Click & Refresh
టీడీపీ కంటే మీడియా పాట్లు ఎక్కువైయ్యాయి
అందుకే ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వంపై ఆయా సమస్యలపై ఉన్నవీ, లేనివి రాస్తూ బరద జల్లే ఈ మీడియా ఇప్పుడు వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టి చంద్రబాబు అత్యంత నీతిమంతుడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి విపరీతంగా యత్నిస్తున్నాయి. ఆ కథనాలతోనే మొత్తం వారి పేపర్లను నింపేస్తున్నారు. వారి టీవీలలో గంటల కొద్ది కథనాలు ప్రసారం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కాడర్ కంటే ఎక్కువగా ఈ మీడియా పాటు పడుతోంది. అందులో భాగంగానే చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక పలువురు మరణిస్తున్నారంటూ వంటకాలు సాగిస్తున్నారు.
తప్పుడు వార్తలని వాళ్లకూ తెలుసు
ఈనాడు, జ్యోతి ఎక్కడెక్కడ ఎవరు చనిపోయినా, ఇందుకే అంటూ వార్తలు ఇస్తున్నాయి. నిజంగానే ఆ స్థాయిలో చనిపోయి ఉంటే మొదటి పేజీలో ఎందుకు ఇవ్వడం లేదు?వారికి తెలుసు. వారు తప్పుడు వార్తలు రాస్తున్నట్లు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు కొంతమంది గుండెపోటుతో మరణించారు. ఆ సందర్భం వేరు. ఆ వార్తలను ఈనాడు వంటి పత్రికలే రాశాయి. వాటి ఆధారంగానే జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం జరిగింది. ఆ యాత్రే ఆయన రాజకీయ ప్రస్తానాన్ని మార్చివేసింది. అది వేరే సంగతి. ఇప్పుడు సందర్భం వేరు.
బాబు కుటుంబంలో ఎవరికి ఏం కాలేదు ఎందుకు?
అయినా అప్పట్లో కూడా టీడీపీ మీడియా, కాంగ్రెస్ఒలోని క వర్గం కలిసి వైఎస్ కుటుంబంలో ఎవరికీ ఎందుకు ఏమీ కాలేదు. బయటవారికి ఎందుకు అయ్యిందంటూ వ్యతిరేక ప్రచారం చేసేవారు. మరి ఇప్పుడు అదే ధీరి వర్తింప చేస్తే చంద్రబాబు కుటుంబంలో ఎవరికి ఏమీ కాకుండా బయట వారికి ఎందుకు అవుతుందన్న ప్రశ్న వస్తుంది. వాస్తవానికి ఇలాంటి వాటిని ప్రస్తావించకూడదు. కానీ టీడీపీ మీడియా జర్నలిజం విలువలను దారుణంగా మంటకలిపి వ్యవహరిస్తున్నందున ఈ విషయాలను గుర్తు చేయవలసి వస్తోంది.
అప్పుడు ప్రకటనలు ఇచ్చారంటేనే అర్థమవుతోంది
ఈ మొత్తం విషయాలను పరిశీలిస్తే, టీడీపీ వారు కాని, టీడీపీ మీడియా కాని ఆశించిన మేర సానుభూతి రావడం లేదని తెలిసిపోతుంది. అందుకోసం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలతో చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. చంద్రబాబు పట్ల వారికి నిజమైన సానుకూలత ఉండి ఉంటే, అరెస్టు అయిన వెంటనే సంఘీభావ ప్రకటనలు చేసి ఉండేవారు. కానీ నాలుగు రోజుల తర్వాత వారు ప్రకటనలు ఇచ్చారంటేనే టీడీపీ నేతలు వారి చుట్టూ తిరిగి మాట్లాడించారన్న అభిప్రాయం కలుగుతుంది.
ఏదో అయిపోతోందనుకోవానే తహతహ
చంద్రబాబు అటు ఎన్డీయేను ఇటు ఇండియా కూటమిలోని ఆయా పార్టీల వారిని ఇద్దరిని తన అవసరాల కోసం వాడుకుని, ఆ తర్వాత వదలివేశారన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చంద్రబాబుకు రాష్ట్రంలో సానుభూతి అంతంతమాత్రంగానే ఉండగా, దేశంలో ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పాలి. కాకపోతే గతంలో ఈనాడు మీడియా కృత్రిమ మద్య నిషేధ ఉద్యమాన్ని సృష్టించినట్లు ఇప్పుడు కూడా రాష్ట్రం అంతా ఏదో అయిపోతోందని అనుకోవాలని తహతహలాడుతోంది.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment