హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన కూడదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అధికారం కోల్పోయామన్న అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ... బీఆర్‌ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించడం కూడా ఎంత వరకూ సబబో ఆయన ఆలోచించుకోవాలి. పీఏసీ పదవి విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం దీనిపై బీఆర్‌ఎస్ విమర్శలకు దిగడం.. పరిస్థితి మరింత ముదిరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (బీఆర్‌ఎస్), గాంధీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు అరికెపూడి గాంధీ వైపునే ఉన్నప్పటికీ సీఎం ఆయన్ను వెనకేసుకుని వచ్చినట్లుగా అనిపిస్తుంది.
సెప్టెంబరు 12 కౌశిక్, గాంధీల మధ్య జరిగిన ఘటనల్లో పోలీసులతోపాటు ప్రభుత్వ వైఫల్యమూ స్పష్టంగా కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో పెట్టిన పోలీసులు గాంధీపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. దీన్నే సాకుగా తీసుకున్నారో ఏమో కానీ.. గాంధీ తన అనుచరులతో కౌశిక్ ఇంటిపై దాడికి దిగారు. కౌశిక్ ఇంటి ముందు కూర్చుని ‘‘మీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటకు రా’’ అంటూ రెచ్చగొట్టే, సినిమా డైలాగులు, ఇతర పరుష పదజాలం ఉపయోగించారు. గాంధీ అనుచరులు మరింత రెచ్చిపోయి కౌశిక్ ఇంటి అద్దాలు పగులగొట్టడమే కాకుండా.. టమోటాలు, కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. తప్పు ఎవరిదన్నది అందరికీ స్పష్టంగా తెలుస్తున్నా పోలీసులు గాంధీని ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచలేదో స్పష్టం చేయలేదు.
ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌పై చేసే ఆరోపణ రాజకీయం అనుకోవచ్చు కానీ.. గురువారం నాటి ఘటనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది. కాంగ్రెస్‌లో చేరిన గాంధీ అనుచరులే. అంతా అయిపోయిన తరువాత పోలీసులు గాంధీపై నామమాత్రంగా కేసులు పెట్టారన్న అభిప్రాయం కూడా ప్రజల్లో నెలకొంది. బీఆర్‌ఎస్ నేత ఎవరైనా కాంగ్రెస్ నేత ఇంటిపై దాడి చేసి ఉంటే కూడా ఇలాగే వ్యవహరించే వారా? లేక... దాడులకు ఎవరు పాల్పడ్డా కఠినంగా వ్యవహరించాని సీఎం చెప్పేవారా? ఇలా చెప్పి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరిగి ఉండేది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. గాంధీ ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాడని సీఎం స్వయంగా చెప్పడం ఇంకో ఎత్తు. గతంలో పీఏసీ పదవిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ఎలా ఇచ్చారని రేవంత్ రెడ్డే ప్రశ్నించారు. మరి ఇప్పుడు అదే తీరులో గాంధీకి పదవి కట్టబెట్టడం ఎంత వరకూ సబబు అవుతుంది?. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, త్వరలో ఆ పార్టీ ఖాళీ అవుతుందని రేవంత్ స్వయంగా విమర్శించారు కదా? అలాగైతే ఆయన ధైర్యంగా వీరందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమై ఉండాల్సింది. ఇలా చేసి ఉంటే ఆయనపై గౌరవం మరింత పెరిగేది.
ఇలా చేయలేదు సరికదా.. పార్టీ మారిన దానం నాగేందర్‌ను ఏకంగా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడుతూంటే రేవంత్ వాటినే ప్రోత్సహించడం, పైగా గాంధీ బీఆర్‌ఎస్ వాడేనని వ్యాఖ్యానించడం, దబాయించడం ఏమంత సముచితంగా అనిపించదు.
సెప్టెంబరు 12 నాటి ఘటనకు ముందు కౌశిక్ రెడ్డి చేసిన కొన్ని పనులు, వ్యాఖ్యలు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారేందుకు కారణమైందన్నది స్పష్టం. ఎందుకంటే.. గాంధీతోపాటు బీఆర్‌ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి గాజులు, చీర ప్రదర్శించడం రెచ్చకొట్టడమే అవుతుంది. అంతేకాదు.. ఈ చర్య మహిళలను కించపరచడం కూడా. రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు బీఆర్‌ఎస్ అభ్యంతరం తెలిపింది.
.. ఇదే అంశంపై గాంధీ, కౌశిక్ రెడ్డిలు పరస్పర ఘాటు విమర్శలకూ దిగారు. అయితే ఒకరింటికి ఒకరు వెళతామని సవాళ్లు విసురుకోవడమే రచ్చగా మారింది. అప్పటికిగానీ ఇది శాంతి భద్రత సమస్య అని గుర్తించలేదు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి స్థానికుడు కాదని బతకడానికి వచ్చిన వాడు వ్యాఖ్యానించడం కూడా సరైంది కాదు. తెలంగాణ వచ్చి పదేళ్ల తర్వాత కూడా ఈ రకమైన వాదన చేయడం బీఆర్‌ఎస్‌కు నష్టం చేసేదని ఆ పార్టీ నేతలు గుర్తించాలి.
హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ స్వీప్ చేయడంలో ఆంధ్రా నుంచి స్థిరపడిన వారి ఓట్లు, ఇతర రాష్ట్రాల వారు ఉన్నారని రేవంత్ స్వయంగా చెప్పిన విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో కౌశిక్ వ్యాఖ్యలను ప్రస్తావించి ముఖ్యమంత్రి కూడా అదే పదం వాడడం అభ్యంతరకరం. బతకడానికి వచ్చిన వారి ఓట్లు కావాలి గానీ, వాళ్లు వద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ అనడం ద్వారా ఆయన కూడా కౌశిక్ లాగానే మాట్లాడారనే భావన కలుగుతుంది. ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వుంటే మళ్లీ ప్రజల మధ్య అనవసరమైన వివాదాలు రాకుండా వుంటాయని చెప్పాలి.
ఫిరాయింపులపై హైకోర్ట్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యానిస్తూ బీఆర్‌ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ఖాళీ అయిపోతోందని కాంగ్రెస్ ప్రచారం చేయడం కూడా అలాంటి సైకలాజిక్ గేమే కదా?. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. ఆ ఆరోపణ నిజం కాకపోతే వారు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి లేదని కోర్టుల నుంచి ఆర్డర్ తీసుకు రావాలని విపక్షాలకు సలహా ఇవ్వడం విడ్డూరంగా ఉంది.
ఏ ఎమ్మెల్యే అయినా అటూ ఇటూ దిక్కులు చూస్తే అనర్హత వేటు పడుతుందంటే తన ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. ఒక పక్క పదిమందిని చేర్చుకొని వారిపై వేటు వేయని రేవంత్ తమాషాగా మాట్లాడుతున్నారు. నిజానికి బీఆర్‌ఎస్ , బీజేపీలు కలిసినా రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి లేదు. అలాంటి అవకాశముంటే ఎన్నికలైన వెంటనే అక్రమమైనా ఒక పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనైనా లాగి ఉండేవారు. ఆ పని చేసే అవకాశం లేదు కాబట్టే రేవంత్ ప్రభుత్వం సేఫ్‌గా వుంది. ఇప్పుడేమో ఆయన పదిమందిని లాగడమే కాకుండా, ఏదో కుట్ర జరుగుతోందని వైరి పక్షాలపై ఆరోపణలు చేస్తున్నారు.
ఏది ఏమైనా ఫిరాయింపుల విషయంలో రేవంత్ తన గురువైన చంద్రబాబునాయుడిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుసరిస్తున్నట్టే వుంది. కొసమెరుపు ఏమంటే కేసీఆర్ లక్కీ నెంబర్ తమ దగ్గర వుందంటూ రేవంత్ రెడ్డి తమకు 66 మంది సభ్యులు వున్నారని గుర్తు చేయడం. కేసీఆర్ లక్కీ నెంబర్ 6గా చెప్పుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలున్నారు. కాబట్టి రెండు 6 సంఖ్యతో వున్నాయి కాబట్టి అలా అని వుండవచ్చుగానీ నిజానికి ఇలాంటి నమ్మకాలున్నవారు అన్ని అంకెల్ని కలిపి ఫైనల్ గా వచ్చిన సింగిల్ డిజిట్ నే లక్కీ నెంబర్ గా చూస్తారు. ఐతే రేవంత్ లక్కీ నెంబర్ తొమ్మిది!!!.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
ఇదీ చదవండి: నా ప్రాణాలకు హాని జరిగితే రేవంత్‌దే బాధ్యత!!
Comments
Please login to add a commentAdd a comment