సమస్యలు కొని తెచ్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి! | KSR Comment On CM Revanth Reddy Ruling | Sakshi
Sakshi News home page

సమస్యలు కొని తెచ్చుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి!

Published Tue, Oct 29 2024 11:17 AM | Last Updated on Tue, Oct 29 2024 11:37 AM

KSR Comment On CM Revanth Reddy Ruling

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చాలా పెద్ద ప్రకటనే చేశారు. హైదరాబాద్‌ను ఫినిష్‌ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్‌లపై తీవ్రమైన ఆరోపణ సంధించారు. అయితే దాన్ని వివరించిన తీరు అంత సంతృప్తికరంగా లేదు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఈ పార్టీలు అడ్డు తగులుతున్నాయని స్థూల అర్థం. కానీ.. ఒక పక్క ప్రధాని మోడీని విమర్శిస్తూనే.. ఇంకో పక్క ఇక్కడ గుజరాత్‌ మోడల్‌ వద్దా? అని రేవంత్‌ ప్రశ్నించడం ఆసక్తికరంగా ఉంది.

ఇదిలా ఉంటే... దీపావళికి ముందో వెనకో రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యపై కూడా మాట మాట పెరుగుతోంది. ఆ పేలే బాంబులు కాంగ్రెస్‌వేనని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు కౌంటర్‌ ఇస్తున్నారు. మరోపక్క బీజేపీ నేతలు కూడా తాము వెనుకబడకూడదనుకున్నారో ఏమో.. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల ఇళ్లు కూల్చొద్దంటూ నిరసనలకు దిగుతున్నారు.

రాజకీయ బాంబుల విషయానికి వస్తే.. ఇప్పటివరకూ అయితే పెద్దగా పేలలేదు. కాంగ్రెస్‌ పార్టీలో జీవన్‌ రెడ్డి, మధుయాష్కీలు నిరసనలు వ్యక్తం చేసినా వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన సమయం ఇంకా రాలేదు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ బావమరింది ఇంటిపై ఎక్సైజ్, పోలీసు సిబ్బంది దాడి కూడా పెద్ద బాంబేమీ కాదు. ఈ సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగానే ఉన్నాయి అనిపిస్తుంది. పైగా కుటుంబ కార్యక్రమాలు జరుపుకోవాలనాన భయపడే విధంగా ఇవి ఉండటం అంత మంచిదేమీ కాదు. పోనీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సంచలన విషయాలు ఏవైనా బయటపడతాయా? ఘటనలు చోటు చేసుకుంటాయా? అని చూస్తే అది ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇంతలోనే బీఆర్‌ఎస్‌ కీలక నేతలను అరెస్ట్‌ చేసే అవకాశం లేదు.

రేవంత్ రెడ్డి ప్రకటన విషయానికి వద్దాం... మూసి పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్లు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అయితే తెలంగాణ గుజరాత్ తో పోటీపడుతుందనే ఉద్దేశంతో తమ ప్రయత్నాలకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ు అడ్డు తగులుతున్నాయని రేవంత్ ఆరోపించారు. ఆశ లావు, పీక సన్నం అన్న చందాన  అన్నీ ఒకేసారి మొదలుపెట్టి ఏదీ ముందుకు వెళ్లలేని పరిస్థితి కల్పించుకుంటే.. గుజరాత్ తో పోటీ పడే సంగతేమోకాని, తెలంగాణ ఆర్థికంగా కుదేలు అవుతుందేమో ఆలోచించుకోవాలి.దేశంలో గుజరాత్ బాగా అభివృద్ది చెందిందని ముఖ్యమంత్రి  ఈ ప్రకటన ద్వారా చెప్పకనే చెబుతున్నారు.

ఒకపక్క ప్రధాని మోడీ దేశానికి ఏమి చేశారని ప్రశ్నిస్తూనే, గుజరాత్ లో సబర్మతి రివర్ ప్రంట్ అభివృద్ధి మొదలైనవాటి గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. గుజరాత్‌ పరిస్థితి వేరు, తెలంగాణ సమస్యలు వేరు. మూసి సుందరీకరణ ప్రాజెక్టుకు.. సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి పోలిక ఎంత వరకూ అన్నది రేవంత్‌ పరిశీలించుకోవాలి. ప్రధాని ఆ రాష్ట్రానికి చెందినవారు కావడం వల్ల కొంత అడ్వాంటేజ్ కచ్చితంగా ఉంటుంది. అంతమాత్రాన దానికి పోటీ అవుతుందని హైదరాబాద్  ను ఫినిష్ చేయాలని విపక్షాలు చూస్తున్నాయని అనడం మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టడమే అవుతుందేమో!

మూసి నది ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందనగానే ఎవరికైనా గుండె గుబిల్లుమంటుంది. అంత మొత్తం ఎలా సమకూరుతుంది? ఇందులో ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఎంత ఇస్తుంది? అప్పులు ఎంత తెస్తారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఎనభై వేల కోట్ల అప్పు చేసిన తీరుపై ఇదే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారు.అదే టైమ్ లో దానికి రెట్టింపు వ్యయం మూసికి చేస్తామని చెబుతున్నారు.

అధికారులు మూసీ బఫర్ జోన్‌ఉన్న ఇళ్ల సర్వేకి వెళితేనే ఎంత పెద్ద గొడవైన వైనాన్ని చూశాం. వేలాది మంది నిర్వాసితులయ్యే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. సహజంగానే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ బీజేపీలు ప్రజల ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తాయి. వారు ఒప్పుకోనంత మాత్రాన ప్రాజెక్టును నిలిపివేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగని ప్రభుత్వం సవాల్ గా తీసుకుని హడావుడి పడనక్కర్లేదు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా మూసి సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారు కాని,నామమాత్రంగానే చేయగలిగారు. హుస్సేన్ సాగర్ నీళ్లు  కొబ్బరి నీళ్లమాదిరి చేస్తామని కేసీఆర్‌ భారీ డైలాగులు చెప్పారు. కానీ అడుగు ముందుకు పడలేదు. హుస్సేన్ సాగర్ శుద్ధి పథకం గతంలో  కోట్ల విజయభాస్కరరెడ్డి టైమ్‌లో కొంత అమలైంది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేశాయి. కానీ దీంట్లోని పరిమితులను దృష్టిలో ఉంచుకుని ముందు వెళ్లలేకపోయాయి.

దక్షిణ కొరియాలోని రెండు నదులను బాగు చేసిన  వైనం తెలుసుకోవడానికి ప్రతినిధి బృందాలు  వెళ్లివచ్చాయి.అయితే అక్కడికి, ఇక్కడికి పోలిక పెట్టలేమన్న అభిప్రాయానికి వచ్చారట. ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్లు ఉంది. అందులో భాగంగా మూసి నదిలో ఇబ్బంది లేని బాపూ ఘాట్ ప్రదేశం వరకు అభివృద్ది చేయాలని సంకల్పించినట్లు కథనాలు వచ్చాయి. 

అలాగే ముందుగా మూసిలోకి వస్తున్న మురుగు నీటిని ఎలా అరికట్టాలన్న దానిపై ప్రభుత్వం దృష్టి పెడితే ప్రయోజనం ఉండవచ్చు. ప్రజల ఇళ్లు తొలగించాల్సిన చోట వారికి కల్పించాల్సిన సదుపాయాలు, ప్రత్యామ్నాయాలను నిర్ణయించుకోవాలి. వైఎస్  రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన ఔటర్‌ రింగ్ రోడ్డు హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చివేసింది. కేసీఆర్‌ ప్రభుత్వం పలు ప్లైఓవర్లను నిర్మించడం ద్వారా సదుపాయాలను మెరుగుపరిచే యత్నం చేసింది. వివిధ ప్రభుత్వాలు మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేసినా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు.

హైదరాబాద్‌ను ఒక్కసారిగా మార్చివేస్తామని చెబుతూ హైడ్రా పేరుతో  ప్రభుత్వం చేసిన  హడావుడి వల్ల  కొంత నష్టం జరిగింది. ప్రజా వ్యతిరేకతతో దూకుడు కొంత తగ్గినా...ప్రజలలో  ఏర్పడిన భయాలు పోలేదని అంటున్నారు. తాజాగా వచ్చిన ఒక కథనాన్ని గమనిస్తే జనం ఇప్పుడు అపార్టుమెంట్లు, విల్లాలు  కొనాలంటే భయపడుతున్నారట. ఫలితంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం సుమారు పాతిక శాతం తగ్గిందట. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గింది. అసలే మాంద్య పరిస్థతులు ఏర్పడుతున్న తరుణంలో రేవంత్ ప్రభుత్వం దుందుడుకుగా చేసిన చర్య హైదరాబాద్ కు  కొంత నష్టం చేసిందన్న అభిప్రాయం ఏర్పడింది.

గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని మించి గాంధీజీ విగ్రహం పెడతామని రేవంత్ ప్రకటించారు. బాగానే ఉంది. ఏదో పోటీ కోసం కాకుండా, అది ఒక టూరిస్ట్ స్పాట్ గా, విజ్ఞాన కేంద్రంగా మార్చితేనే ఉపయోగం ఉంటుంది. కేసీఆర్‌ ప్రభుత్వం భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కాని అక్కడకు రేవంత్ కాని, కాంగ్రెస్  నేతలు కాని వెళుతున్నట్లు లేరు. ఇలాంటి వైఖరులు కూడా అంత మేలు చేయవని చెప్పాలి. రేవంత్ తన స్పీచ్ లో కేసీఆర్‌ బయటకు రాకపోవడాన్ని తప్పు పట్టారు. ఆ వ్యాఖ్యలు చూస్తే,తాను చేస్తున్న విమర్శలకు కేసీఆర్‌ సమాధానం ఇవ్వడం లేదన్న అసహనం ఉన్నట్లుగా అనిపిస్తుంది.

హైదరాబాద్‌కు చాలా చేయాలని ఆయన అనుకుంటూ ఉండవచ్చు కానీ ఆచరణ సాధ్యం కానివైతే మాత్రం అది రాజకీయంగా ఆయనకు బెడిసికొట్టే ప్రమాదం ఉంది.  ఫోర్త్‌ సిటీ ప్రస్తావన వీటిల్లో ఒకటి. మామూలుగా ఏవరూ నగరాలను నిర్మించలేరు. మౌలిక వసతులు కల్పిస్తే, కొత్త పరిశ్రమలు లేదా సంస్థలు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లో జనావాసాలు వాటంతట అవే ఏర్పడుతూంటాయి. వ్యాపారాలు పెరుగుతాయి. తద్వారా అభివృద్ది జరుగుతుంది. ఫోర్త్ సిటీ ఎలా ఉంటుందో తెలియదు కాని, దాని పేరుతో ఇప్పటికే కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్న వార్తలు వస్తున్నాయి. నగరానికి దక్షిణం వైపు అభివృద్దికి శ్రీకారం చుట్టడం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి మోడల్‌లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చేఏ‍్త మాత్రం ప్రయోజనమెంతో ఆలోచించాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్‌కు బీఆర్‌ఎస్‌ బీజేపీలు పెద్ద సవాల్ కాదు. ఆయనకు ఆయనే సమస్యలను సృష్టించుకుంటున్నారు. సూపర్ సిక్స్ హామీలు అన్నిటిని  అమలు చేయలేకపోవడం సహజంగానే ఇబ్బందిగా ఉంటుంది. అయినా హైదరాబాద్ కు  నష్టం కలిగించే పనులు కాకుండా, వీలైనంత మేర సదుపాయాలు మెరుగుపరుస్తూ ముందుకు వెళితే ఎక్కువ లాభం ఉంటుంది.అంతే తప్ప, అన్నీ ఒకేసారి చేసేయాలన్న తాపత్రయంతో వెళితే, అదే ఆయనకు ముందరికాళ్లకు బంధం వేసుకున్నట్లు అవుతుందని చెప్పాలి.



- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement