
తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారే ప్రమాదం ఉందా?ఈనాడు మీడియా తప్ప మిగిలిన మీడియా అంతా దీనికి సంబంధించి కాగ్ ప్రాధమిక నివేదికపై ఇచ్చిన కథనాలు కాస్త ఆందోళన కలిగించేవే. సంవత్సరానికి ఈ ప్రాజెక్టు వినియోగానికి సుమారు 25,100 కోట్ల మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని కాగ్ అంచనా వేసింది. తొంభై వేల కోట్ల అప్పుతో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం కనబడుతోంది. ఇప్పటినుంచే ప్రభుత్వం దీనిపై జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం కనబడుతుంది.కాగ్ లేవనెత్తిన సందేహాలకు అధికారులు ఎలా సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరమైన అంశం.
విశేషం ఏమిటంటే ఏపీలో చీమ చిటుక్కుమన్నా, చిన్న ఘటన జరిగినా బానర్ కథనాలుగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంట వండి వార్చి బానర్ కథనాలు ఇచ్చే ఈనాడు పత్రికలో దీనికి సంబంధించిన కథనమే కనిపించలేదు.అన్ని పత్రికలు దీనిపై పూర్తిగాకేంద్రీకరించాయని చెప్పలేం కాని వార్తనైతే ఎలాగొలా కవర్ చేశాయి. ఈనాడు మాత్రం దీని జోలికి వెళ్లడానికి భయపడింది. ఏడాదికి పాతికవేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యయం అవుతుందని ,దానిని ఎలా భరిస్తారని కాగ్ ప్రశ్నిస్తే అది ఈనాడు మీడియాకు వార్త కాలేదు. కారణం .ఈ వార్త తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉండడమే.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైనా కోపం వస్తే తమకు నష్టమని భావించే ఈ వార్తను ఇచ్చినట్లు లేరు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈనాడు మీడియా జర్నలిజం ప్రమాణాలను ఎలా దిగజార్చింది చెప్పడానికి. తెలంగాణలో ఒక తీరుగా, ఆంధ్రప్రదేశ్ లో మరో రీతిగా వార్తలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని ఈనాడు ప్రయత్నిస్తోందని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదు. పొరపాటున ఏపీలో కనుక జగన్ ప్రభుత్వంపై కాగ్ ఏదైనా చిన్న వ్యాఖ్య చేస్తే మొదటి పేజీలో ప్రముఖంగా వార్తలు ఇవ్వడమే కాకుండా,పుంఖానుపుంఖాలుగా కథనాలు ఇచ్చేది. ఈ మద్యకాలంలో అలా ఒకటి,రెండు జరిగాయి కూడా. వాటితో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన ప్రాధమిక నివేదిక చాలా సీరియస్ అయినదని చెప్పాలి.
నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఆరంభించినప్పుడు ఇది సాధ్యమా అన్న ప్రశ్న వచ్చింది. ఆయన ఎలాగైతే గతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి ఈ కాళేశ్వరాన్ని అమలు చేశారు. మూడు బ్యారేజీలు నిర్మించారు. అది గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించారు. ఒక రకంగా కేసీఆర్ ఇంత భారీ ప్రాజెక్టును ఆరంభించి చేయడం సాహసమే. అది ఆయన సమర్ధతకు నిదర్శనమే.అంతవరకు ఓకే గాని కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున వ్యయం అయిన ఈ ప్రాజెక్టు వల్ల ఎంత ప్రయోజనం జరుగుతుందన్నది మొదటి నుంచి చర్చనీయాంశం అయింది.ప్రస్తుతానికి లక్ష కోట్ల వ్యయం అయినా అది పూర్తి కాలేదు. మరో ఏభై వేల కోట్లు అవసరమని అంచనా. అంటే లక్షా ఏభైవేల కోట్ల రూపాయలు వెచ్చించాలన్నమాట.
మొత్తం తెలంగాణ అంతటికి ఈ ప్రాజెక్టు పుష్కలంగా నీటిని సరఫరా చేస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. అలా జరిగితే అంతకన్నా కావల్సింది ఏమి ఉంటుంది? కాని అలా జరగడం లేదని నిపుణులు చెబుతున్నారు. అసలు కొత్త ఆయకట్టు వచ్చిందే లక్ష ఎకరాల లోపు అని వార్తాపత్రికలలో కథనాలు వచ్చాయి. ప్రపంచలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా దీనిని అభివర్ణిస్తుంటారు. అంతవరకు బాగానే ఉన్నా, లిప్ట్ల నిర్వహణ వ్యయమే తడిసి మోపెడవుతోందన్నది కాగ్ వ్యాఖ్య.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేశారు. అప్పట్లో దాని వ్యయం ముప్పైఐదు వేల కోట్లుగా అంచనా వేశారు. దానిని అమలు చేసినా వ్యయం పెరిగి సుమారు అరవైమూడు వేల కోట్ల అంచనాకు చేరేదట. అయినా ప్రస్తుతం లక్షాఏభైవేల కోట్ల ప్రాజెక్టుతో పోల్చితే అది మెరుగైనదే కదా అని కొందరి వాదన. తుమ్మిడి హెట్టి అనేచోట ప్రాజెక్టును నిర్మించి కాల్వల ద్వారా నీటిని మళ్లిస్తే ఎక్కువ మేలు జరిగేదని కొందరి వాదన. అక్కడ నీరు అధికంగా అందుబాటులో ఉండడమే కారణం.
కేసీఆర్ ప్రభుత్వం దానిని మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల ద్వారా రుణాలు పొంది ఒక దశకు తీసుకు వచ్చింది. భూ సేకరణ పూర్తి కాకపోవడం, కాల్వల నిర్మాణం లేకపోవడం, గోదావరి వరదలు వస్తే లిఫ్ట్ లు ఒక్కోసారి మునిగిపోవడం తదితర సమస్యల కారణంగా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదన్నది కొంతమంది నిపుణుల వాదనగా ఉంది. వైఎస్ టైమ్ లో 35 వేల కోట్ల ప్రాజెక్టు అంటేనే అమ్మో అనుకునే పరిస్థితి. అలాంటి ఇప్పుడు ఏకంగా లక్ష కోట్లు దాటి పోయింది. అయినా పూర్తి కాలేదు. దాని ఫలాలు ఆశించిన రీతిలో అందడం లేదు.ఈ నేపధ్యంలో ఎన్నికల సమయంలో కాగ్ నివేదిక బయటకు రావడం ప్రభుత్వానికి ఇబ్బందే. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేరే విషయం. కాని కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ పనిచేయడానికి అవసరమయ్యే విద్యుత్, అప్పులపై వడ్డీ, ఇతరత్రా నిర్వహణ ఖర్చులు అన్నీ కలిపి ఏడాదికి పాతికవేల కోట్లు వ్యయం అవుతుంది. కచ్చితంగా ఇంత మొత్తం ఏ ప్రభుత్వానికి అయినా పెనుభారమే.దీనిని రైతుల నుంచి వసూలు చేయడం అసాధ్యం.ఎందుకంటే ఎకరాకు వేల రూపాయలు పడుతుంది. అందువల్ల రైతుల జోలికి వెళ్లలేరు. పరిశ్రమలకు నీటిని ఇచ్చే పరిస్థితి ఇంకా రాలేదు. వచ్చినా అందులో ఎంత ఆదాయం వస్తుందన్నది చెప్పలేం. ఇప్పటికే ప్రతిపక్షాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు ఆరోపణలు సంధిస్తుంటాయి. వారికి కాగ్ నివేదిక ఒక ఆయుధం ఇచ్చినట్లు అయింది. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఎదుర్కుంటారో చూడాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment