‘ఈనాడు’ చెత్త రాతలు.. రామోజీ ఇక మారవా? | KSR Comments Over Yellow Media Fake News On AP Govt Over Upcoming Industries In AP - Sakshi
Sakshi News home page

‘ఈనాడు’ చెత్త రాతలు.. రామోజీ ఇక మారవా?

Dec 18 2023 2:42 PM | Updated on Jan 24 2024 3:04 PM

KSR Comments Over Yellow Media Fake News In AP - Sakshi

ఏపీలో పరిశ్రమలను తరిమేస్తున్నారని నిత్యం ఈనాడు మీడియా విష ప్రచారం. ఈనాడు పత్రిక డిసెంబర్ 11వ తేదీన మొదటి పేజీలో వేసిన ఈ వార్త చదివితే ఎవరు ఏపీకి పరిశ్రమలు రాకుండా ఈ మీడియావారే అడ్డుపడుతున్నారన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఒక ప్రముఖ పరిశ్రమ ఏదైనా ఏపీకి వస్తోందంటే కళ్లలో నిప్పులు పోసుకోవడమే కాకుండా, దానిని ఎలా చెడగొట్టాలా అని ఈనాడు రామోజీరావు, వారి సంపాదక బృందం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. 

✍️నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద సోలార్ పానెల్స్ తయారీకి సంబంధించిన భారీ పరిశ్రమను పెట్టడానికి ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్   సన్నాహాలు  చేస్తోంది. దీనికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది. ఈ కంపెనీకి సంబంధించిన పెట్టుబడులు ఏపీకి రాకూడదన్న దురుద్దేశంతో వారిపై ఎప్పటి నుంచో ఈనాడు వ్యతిరేక కథనాలు ఇస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీకి కూడా అడ్డు పడాలని, లేదా కంపెనీ వచ్చినా ఆ మంచిపేరు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి రాకూడదని ఈనాడు మీడియా పనిచేస్తోంది. అందులో భాగంగా రూ.47,809 కోట్లు  దోచిపెడుతున్నారంటూ ఒక తప్పుడు వార్తను ఇచ్చింది. ఆ వార్తను మొదటి నుంచి చివరిదాకా చదివితే ఆ ప్రాజెక్టు ఏమిటి? దానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు. అసలు అలాంటి పరిశ్రమ భారత దేశంలో ఇంతవరకు వచ్చిందా? అన్న విషయాల జోలికి పత్రిక వెళ్లలేదు. ఎంత సేపు బురద జల్లడమే  లక్ష్యంగా పెట్టుకుని కాకి లెక్కలతో పిచ్చి స్టోరీని ఇచ్చేసింది.

✍️ఏ పరిశ్రమకు అయినా కొన్ని రాయితీలను ప్రభుత్వం ఇస్తుంది. ఈ భారీ పరిశ్రమకు విద్యుత్ టారిఫ్‌కు సంబంధించి కొంచెం అధికంగా రాయితీలు ఇస్తున్నారని ఈనాడు బాధ. కానీ, దాని వల్ల వచ్చే ప్రయోజనాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు. సుమారు అరవై వేల కోట్ల వ్యయంతో సోలార్ మాడ్యూల్స్ ప్రాజెక్టు ఏపీలో ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. దానివల్ల ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. దేశంలోనే ఈ తరహా ప్రాజెక్టు మొదటిదని చెబుతున్నారు. రామాయపట్నం పోర్టు వినియోగానికి సిద్దం అవుతున్నందున అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఆయా సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో ఇండోసోల్ సంస్థ ఒకటి. కొన్నివేల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ఏపీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో ఈనాడు రామోజీరావు కాకి లెక్కలు తయారు చేసి పదిహేనేళ్లలో నలభైఏడువేల కోట్ల రాయితీ ఇస్తారంటూ ఇష్టారీతిన రాసిపడేసింది. 

✍️ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌర విద్యుత్, రెన్యుబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా సరఫరా అవుతున్నందున విద్యుత్ రేట్లను సమీక్షించాలని నిర్ణయించింది. బయట మార్కెట్‌లో యూనిట్ రెండున్నర రూపాయలకు దొరుకుతుంటే, ఈ ప్రాజెక్టుల నుంచి నాలుగున్నర వరకు పెట్టి కొనుగోలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఇందులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ ఒప్పందాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందో లేదో, ఇంకేముంది.. అంతర్జాతీయంగా చెడ్డ పేరు వచ్చేస్తోందంటూ తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి గగ్గెలుపెట్టాయి. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల వేల కోట్ల నష్టం జరుగుతోందని ప్రభుత్వం భావించినా, ససేమిరా ఆ రేట్లను తగ్గించడానికి వీలు లేదని ఇదే ఈనాడు మీడియా ప్రచారం చేసింది. దీనివల్ల పరిశ్రమలురావని కూడా  గోల చేసింది. 

✍️ఇదే కాదు.. ఆయా పరిశ్రమలు తమ సొంత కారణాలతో వేరే చోట యూనిట్లు పెట్టుకుంటున్నా.. ఏపీలో పెట్టకపోవడానికి ప్రభుత్వమే కారణమని దుష్ప్రచారం చేశారు. మరోవైపు పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా చెడగొట్టాలాన్న ధ్యేయంతో పని చేస్తున్నారు. రామాయంపట్నం వద్ద ఇండోసోల్ పరిశ్రమ వస్తే నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల ప్రజలకు పెద్ద ఎత్తున  ఉపాధి అవకాశాలు వస్తాయి. అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో భూముల విలువలు పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారు. దీనిని చూసి ఓర్వలేని ఈనాడు ఇలాంటి విషపు రాతలు రాసింది. ఒకవేళ ఏపీపై ఈనాడు రామోజీరావుకు ప్రేమ ఉంటే, ముందుగా ఆ ప్రాజెక్టు ఏర్పాటును స్వాగతించాలి కదా!. దాని ద్వారా జరిగే మేలును వివరించాలి కదా!. ఆ తర్వాత నిజంగానే ఏవైనా అధిక రాయితీలు ఇస్తుంటే దానిపై వార్త ఇవ్వవచ్చు. అప్పుడు  ఏదైనా మంచి ఉద్దేశంతో కథనాలు ఇచ్చారులే అనుకునే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా ఎంతసేపు ఏడుపుగొట్టు వార్తలనే ఇస్తున్నారు. పుంగనూరు వద్ద నాలుగువేల కోట్లతో విద్యుత్ బస్‌ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఒక విదేశీ కంపెనీ ముందుకు వచ్చింది. అక్కడ సుమారు 800 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తోంది. దానిని చెడగొట్టడానికి ప్రయత్నాలు ఆరంభించారు.

✍️కొందరు రైతులు తమ భూములను ఇవ్వడానికి అభ్యంతరం చెప్పారట. అంతే.. దానిని పనికట్టుకుని ఏపీ అంతటా ప్రచారం చేస్తూ ప్రభుత్వం ఏదో తప్పు పనిచేస్తోందన్న భావన కల్పించడానికి ఈనాడు ప్రయత్నించింది. భూములు లేకుండా పరిశ్రమలు  ఎలా వస్తాయో ఈనాడు చెప్పాలి. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలంగాణలో ఒక యూనిట్ పెట్టుకుంటుంటే.. ఏపీకి రాకుండా చేశారంటూ దుష్ప్రచారం చేశారు. విశాఖలో డేటా సెంటర్‌కు భూమి ఇస్తున్నా అంతెందుకు, ఇంతెందుకు అంటూ వ్యతిరేక కథనాలు వండారు. విశాఖకు అసలు ఐటీ పరిశ్రమలే రావడం లేదని ప్రచారం చేస్తుంటారు. ఐటీకి చావుదెబ్బ అంటూ డిసెంబర్ 18న మరో దుర్మార్గపు వార్త రాశారు. తీరా ఇన్ఫోసిస్‌, తదితర కంపెనీలు వస్తుంటే మాత్రం వాటిని వార్తలుగా ఇవ్వరు. చంద్రబాబు హయాంలో వెయ్యి కోట్ల లోపు ఐటీ ఎగుమతులు ఉంటే, సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో అవి సుమారు రెండువేల కోట్లకు పెరిగాయి. 

✍️విశాఖలో ఐటీ టవర్, రహేజా పార్క్ మొదలైనవి నిర్మాణంలో ఉన్నాయి. వాటి గురించి ప్రజలు ఎవరికీ తెలియకూడదని ఐటి కంపెనీలకు అది అయింది.. ఇది అయింది.. అంటూ చెత్త కథనాలను ప్రచారం చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వార్తలు ఇస్తున్న తీరు నిజంగా దారుణమనిపిస్తుంది. గతంలో చంద్రబాబు  హయాంలో కియా కార్ల పరిశ్రమ వస్తే  ఎంతో గొప్పగా ప్రచారం చేశారు. దానికి ఎన్నివేల కోట్ల మేర అప్పటి ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందో తెలియదా? తీరా చూస్తే అక్కడ వెయ్యి మంది స్థానికులకు కూడా ఉపాధి రాలేదు. అయినా ఫర్వాలేదు. ఏదో ఒక పరిశ్రమ వచ్చిందిలే అని అనుకున్నారు. ఇప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పించే విధంగా  రామాయపట్నం వద్ద అరవైవేల కోట్ల వ్యయంతో ఒక భారీ పరిశ్రమ వస్తుంటే దోచుకుంటున్నారంటూ ఈనాడు రామోజీరావు  బృందం తెగ ఏడ్చేస్తోంది. ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న ఈ మీడియా ఆంధ్రప్రదేశ్‌కు అవసరమా!.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement