సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పార్టీ వీడుతున్న నేతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో బీఆర్‌ఎస్ వీడుతున్న వాళ్లు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలోకి రానివ్వమని తేల్చి చెప్పారు.
రాజకీయాల్లో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని అన్నారు. కానీ అధికారం పోగానే, తమ ప్రయోజనాల కోసం పార్టీ వదిలి ఇతర పార్టీలో చేరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బీఆర్‌ఎస్‌ను వదిలి వెళ్తున్న వారు మళ్లీ పార్టీలో చేరుతామని కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానివ్వమని చెప్పారు. వాళ్లకు తప్పకుండా బుద్ధి చెప్తామని అన్నారు.
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మహేందర్‌రెడ్డికి పదవి ఇచ్చినా పార్టీ మారాడని మండిపడ్డారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటూ ధ్వజమెత్తారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 4 స్థానాల్లో గెలిచాం. పరిగిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాం. వికారాబాద్‌లో కూడా ఏం జరిగిందో తెలియదు కానీ స్వల్ప తేడాతో ఓడిపోయాం. తాండూరులో గెలుపు ఏకపక్షంగా ఉంటుందనుకున్నా. ఎందుకంటే మహేందర్ రెడ్డిని బిజీగా పెట్టాం. పోటీ లేదు. ఎదురు లేదనుకున్నాం.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని పెద్దలు చెబుతారు. మంత్రిని చేశాం.. ఇక లొల్లి పెట్టడు అనుకున్నాం.
చదవండి: KTR: రాజకీయ బేహారులకు జవాబు చెప్పేది వాళ్లే
మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డికి సహకరిస్తాడుఅనుకున్నాం. కానీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత ఆ రెండు నియోజకవర్గాల్లో అడ్డా పెట్టి, పార్టీలోనే ఉండుకుంటూ వెన్నుపోటు పొడిచి మన నాయకులను ఓడగొట్టారు. మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి ఓటమికి మన వాళ్లే కారణం అనేది అక్షర సత్యం.
2019 లో కొండ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారాడు, ఓడిస్తాం అని చెప్పి ఓడించాం. అన్ని మంచి మాటలు చెప్పి, కేసిఆర్ కూతురు అరెస్ట్ అయిన సమయంలో ఇలాంటి నేతలు పార్టీ మారుతున్నారు. ఇలాంటి వాళ్ళని జనం క్షమించరు, వాళ్ళని పార్టీ లోకి తీసుకునే ప్రసక్తే లేదు. మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చాక మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి వస్తామంటే కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న పార్టీలోకి రానివ్వం. చేవెళ్ల లో నిలబడ్డది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్. కేసీఆర్ కోసం మనం పనిచేయాలి. పార్టీ మారుతున్న నేతలు వెళ్ళేటప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. పట్టించుకోవద్దు
పరిగి, చేవెళ్ల బీఆర్‌ఎస్ సభలో నా కంటే ఎక్కువగా రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తిట్టారు. పరిగిలో నాలుగైదు వేల మంది మీటింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌లోకి పోతున్నట్లు నా మీద పుకార్లు వస్తున్నాయి. నా ఒక్కని మీద వస్తలేవు.. రంజిత్ రెడడి మీద కూడా వస్తున్నాయి అని మహేందర్ రెడ్డి అన్నారు. ఇక ఇద్దరు లొల్లి పెట్టుకున్నారు. ఆస్కార్ అవార్డు కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశారు. అద్భుతమైన స్పీచ్‌లు ఇచ్చారు. నేను ఇద్దర్నీ పిచ్చిగా నమ్మాను. చూస్తే 15 రోజుల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ చేర్చుకోం’ అని కేటీఆర్ తెలిపారు.
కష్టకాలంలో పార్టీని వీడుతున్న వాళ్ళు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ పార్టీలోకి రానివ్వం.
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/sp5JHsXWNg— BRS Party (@BRSparty) March 29, 2024
కాగా లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌లు తగులుతున్నాయి. జంపింగ్ జపాంగుల పర్వం జోరందుకుంది. బీఆర్‌ఎస్ నేతలంతా ఒక్కొకరుగా వరుస పెట్టి పార్టీని వీడుతున్నారు. ప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. సిట్టింగులు సైతం పార్టీ మారారు. ఇప్పటికే తాటికొండ రాజయ్య, పట్నం మహేందర్ రెడ్డి, విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, ఎంపీ రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి వంటి కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరగా.. మరికొన్ని రోజుల్లో మేయర్ విజయలక్ష్మి, కేకే, కడియం శ్రీహరి, కావ్య, గడ్డం అరవింద్, ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వరుస నిష్క్రమణలతో గులాబీ దళంలో కలవరం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment