సాక్షి, మహబూబాబాద్: గిరిజనుల ఆరాధ్య దైవం కుమురం భీమ్ నినదించిన జల్.. జంగిల్.. జమీన్ డిమాండ్ నెరవేరిందని, ప్రభుత్వం పోడు భూములకు గిరిజనులే యజమానులుగా గుర్తించి పట్టాలు ఇవ్వడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కె. తారక రామారావు చెప్పారు. ఈ నెల నుంచే వారికి రైతుబంధు, రైతు బీమా కూడా వర్తిస్తుందని తెలిపారు.
శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత కూరగాయల మార్కెట్, ఇతర అభివృద్ధి పనులను, 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గిరిజనులకు పోడు భూముల హక్కుపత్రాలను అందజేసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పా టయ్యాక అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకున్నామని.. మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కాలంతో పోటీపడి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామన్నారు.
ప్రధాని సమాధానం చెప్పాలి
ములుగులో గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారని.. వీటిని ఎందుకు అమలు చేయడం లేదో కొద్దిరోజుల్లో వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అన్నీ ఉచితంగా ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్తోందని.. వారు చందమామను కూడా ఇస్తామంటారని ఎద్దేవా చేశారు. కాగా.. ఎన్నో ఏళ్ల కల అయిన పోడు పట్టాల పంపిణీని చివరికి కేసీఆర్ నెరవేర్చారని మంత్రి సత్య వతి రాథోడ్ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న క్రమంలో ఓ దర్జీ కథ చెప్తూ.. కురవి వీరభద్రస్వామిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
శీనన్నా.. ఆరోగ్యం బాగుందా..?
మహబూబాబాద్‌లోని రాంచంద్రాపురం కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. పిల్లి విజయ–శ్రీను దంపతులను గృహప్రవేశం చేయించారు. అనారోగ్యానికి గురై మంచంలో ఉన్న శ్రీనును పలకరించారు. ‘‘శీనన్నా.. ఆరోగ్యం ఎలా ఉంది.. పింఛన్ వస్తుందా? ఎందరు పిల్లలు, ఏం చదువుతున్నారు?’’అని అడిగారు. తర్వాత మంత్రి సత్యవతిరాథోడ్ పిల్లి విజయ–శ్రీను దంపతులకు నూతన వ్రస్తాలను, డబుల్ బెడ్రూం ఇంటి పట్టాను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment