
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్, బీజేపీలు పోటాపోటీగా ధర్నాలు చేస్తే రైతుల ధాన్యం కొనేదెవరని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. ‘కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్టు’ఢిల్లీలో సీఎం కేసీఆర్ ధర్నా సాగిందని, అది దొంగదీక్ష అని, రైతులను దగా చేసే కుట్రతో కేసీఆర్ క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఫిషర్‌మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలసి వారు విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ ధర్నాలో సీఎం కేసీఆర్ హిందీలో మాట్లాడితే రైతుల ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారమవుతుందా అని మధుయాష్కీ ప్రశ్నించారు. పన్ను నొప్పి పేరుతో వారం రోజులు ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ మొక్కుబడి దీక్ష చేశారని, ఢిల్లీలోని స్టార్ హోటళ్లలో టీఆర్‌ఎస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నామని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment