సాక్షి, విజయవాడ: అమిత్‌షా చెప్పేంతవరకు జీవీఎల్‌కు తెలియదా? విశాఖలో భూదందా జరిగితే ఎందుకు అడగలేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయనే అమిత్‌షా వ్యాఖ్యలు.. రాజకీయ లబ్ధి పొందాలనే మాపై ఆరోపణలు చేశారని మంత్రి అన్నారు.
‘‘టీడీపీ మాటలనే బీజేపీ చెబుతోంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందనే కడుపుమంటతోనే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ముష్టి వేసినట్లు నిధులు వేస్తున్నారు. ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంట్‌పై ఎందుకు మాట్లాడలేదు?. కేంద్రం నుంచి వచ్చిన వారు ఒక విజన్‌తో మాట్లాడాలి’’ అంటూ మంత్రి బొత్స దుయ్యబట్టారు.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై మంత్రి బొత్స సెటైర్లు
పవన్ కళ్యాణ్ యాత్ర పై మంత్రి బొత్స సెటైర్లు విసిరారు. కాశీ యాత్రలాగా.. ఛార్ ధమ్ యాత్రలా.. వారాహి యాత్ర అంటే ఏం అర్థం అవుతుంది? అంటూ ఎద్దేవా చేశారు. ‘‘రాజకీయ నాయకులు యాత్రలు చేస్తే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవటం సాధారణం. వైఎస్ జగన్ పాదయాత్ర అప్పుడూ మేం అనుమతి తీసుకున్నాం. రాజ్యాంగబద్దంగా ఎవరి పై ఎటువంటి ఆంక్షలు లేవు. వైఎస్సార్‌సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆపేస్తానని చెప్పమనండి. పవన్ కళ్యాణ్ పార్ట్‌నర్ మొన్ననే మేం అమలు చేస్తున్న పథకాలను పెంచి ఇస్తానని చెప్పాడు. చంద్రబాబు తాను తీసుకుని వచ్చిన ఒక పథకం పేరు చెప్పగలడా?’’ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు.
‘‘మూడు టీవీలు ఉన్నాయని సొల్లు కబుర్లు చెబితే సరిపోతుందా?. వాళ్లు రాజకీయ నాయకులే.. తపస్సు చేసుకునే సాధువులు కాదు. ఎన్నికలు రాగానే టక్కుటమారా వేషాలు వేస్తున్నారు’’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment