సాక్షి, కామారెడ్డి: ‘తెలంగాణల బీజేపీ దుకాణం బందైనట్టే కనబడుతోంది. ఈ మధ్య సప్పుడు లేదు. అండ్లకెళ్లి ఒక్కొక్కడు బీఆర్‌ఎస్ దిక్కు తొంగి సూస్తున్నరు. ఇంకొందరు వేరే పార్టీల దిక్కు సూస్తున్నరు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేనట్టు ఆ పార్టీ లీడర్లకు అర్థమైంది. అందుకే కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుందామని తండ్లాడుతున్నరు’అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.
ఆదివారం హరీశ్‌రావు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం లింగంపేటలో బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తప్పుడు ప్రచారాన్ని అభివృద్ధి అనే ఆయుధంతో సమాధానం ఇవ్వాలన్నారు. ‘కాంగ్రెస్‌కు 40–50 స్థానాల్లో అభ్యర్థులే లేరు. అధికారంలోకి రావడమనేది కలే. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెబుతున్నారు. ధరణిని రద్దు చేస్తే వీఆర్వోలు వస్తరు, మళ్లీ లంచాలు ఉంటేనే పని జరుగుతది. బీజేపోళ్లు ఎల్లెనుకలవడ్డరు, వాళ్ల దుకాణం బందైనట్టే’నని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి పోతున్నరని, కేసీఆర్ బలపడితే తెలంగాణకు లాభం జరుగుతదని హరీశ్ పేర్కొన్నారు.
కేసీఆర్ ఎదిగితే తెలంగాణకు మేలు జరుగుతదని, తెలంగాణ మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ రాహుల్ గాందీకో, మోదీకో ఉంటుందా అని ప్రశ్నించారు. వైద్యంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో నిలిచిందని, కొన్ని రోజుల్లో దేశంలో మొదటిస్థానంలో ఉంటామని స్పష్టం చేశారు. సభలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, జెడ్పీ చైర్‌పర్సన్ దఫేదార్ శోభ తదితరులు పాల్గొన్నారు.
నీతి ఆయోగ్ ఇజ్జత్ తీశారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను తుంగలో తొక్కి పైసా విడుదల చేయకుండా ఆ నీతి ఆయోగ్ ఇజ్జత్ తీసిన బీజేపీ సర్కారు.. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ రాలేదని అనడం విడ్డూరంగా ఉందని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సమావేశానికి పది మంది సీఎంలు కూడా గైర్హాజరయ్యారన్నారు. ఆదివారం ఆయన మెదక్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని, టీమిండియా అని చెబుతూనే తోడో ఇండియాలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌ను రాష్ట్రపతితో ప్రారంభించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలని తాము డిమాండ్ చేస్తుంటే బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ స్పందించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment