సాక్షి,కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు అమ్ముడుపోతారన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ రెండుగా చీలి పోతుందని చెప్పారు. మంగళ సూత్రాలు అమ్మిన సంజయ్‌కి ఇప్పుడు లక్షల రూపాయలతో కటౌట్స్ పెట్టుకునే డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఆదివారం పొన్నం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంటుకు బండిసంజయ్ తెచ్చిన నిధులు శూన్యమని పొన్నం విమర్శించారు.
‘శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠ పండితులు చేస్తారు. అయోధ్య దేవాలయం నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే అశాస్త్రీయంగా మందిర ప్రారంభం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామమందిర ప్రారంభానికి పోవద్దని ఎక్కడా చెప్పలేదు. రాముడి పేరుతో బీజేపీ మార్కెటింగ్ చేస్తోంది. రేషన్ బియ్యం తెచ్చి రాములోరి అక్షింతలంటున్నారు. ఎంపీగా బండిసంజయ్ కొండగట్టు, వేములవాడ కోసం నిధులు ఏమైనా తీసుకువచ్చాడా..? చెప్పాలి.
బండిసంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, పోనీ, జ్యోతిష్య శాస్త్రమూ చదువలేదు. బండిసంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కరెప్షన్ ఆరోపణలు రావడం వల్లే తొలగించారు. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. మాతో పోటి పడేది ఎవరో మిగిలిన పార్టీలే తేల్చుకోవాలి. బండిసంజయ్, వినోద్ కుమార్ ఇద్దరికీ కరీంనగర్‌లో ఓట్లు అడిగే హక్కు లేదు.
కరీంనగర్ స్మార్ట్ సిటిలో అవినీతి జరిగితే మాజీ మంత్రి గంగుల కమలాకర్, బండిసంజయ్ ప్రేక్షక పాత్ర వహించారు. అవినీతి, అక్రమాలపై ఎంక్వైరీ నడుస్తోంది. త్వరలో అన్నీ బయటికి వస్తాయి’ అని పొన్నం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment