సాక్షి, హైదరాబాద్: తమ మేనిఫెస్టోపై విష ప్రచారం చేస్తున్నారని.. బీఆర్‌ఎస్ వేసిన ‘420 పుస్తకాన్ని ఖండిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 420 పుస్తకం వేసి బీఆర్ఎస్ తన పరువు తానే తీసుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరన్నారు.
‘‘ఆర్థిక క్రమశిక్షణతో మా ప్రభుత్వం ప్రజలకు అవసరయ్యే నిర్ణయాలు తీసుకుంటాం. ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం ఇవ్వరా?. బీఆర్ఎస్ నాయకులు మహిళలకు ఉచిత బస్సు వద్దని చెప్పదలచుకున్నారా?. ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 పథకాలు అమలు చేశాం. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత గానీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయలేదు. 2018లో ప్రజలిచ్చిన తీర్పును బాధ్యత లేకుండా అలుసుగా తీసుకున్నారు. నవ్విపోదురు గాక నాకేమీ సిగ్గు అనేలాగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు’’ అంటూ మంత్రి మండిపడ్డారు.
పది సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలపై వేలాది మంది ప్రజావాణికి వస్తున్నారు. కనీసం సంవత్సరం తర్వాత మా పాలనపై విమర్శిస్తే బాగుండేది. 2014, 2018లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది’’ అంటూ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.
గడిల పాలన కాదు.. గల్లీ బిడ్డల పాలన: సీతక్క
అధికారం పోయిందనే అక్కసుతో బీఆర్ఎస్ దుర్మార్గానికి ఒడి గట్టిందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. గడిల పాలన కాదు గల్లీ బిడ్డల పాలన కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు, కుటుంబ పాలన పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ హితవు పలికారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అన్నట్లు వ్యవహరించి పాలన చేశారు. అధికారం లేకుండా బతకలేని పార్టీగా తయారయ్యారు. ప్రజా స్పందన చూసి ఓర్వలేక పోతున్నారు. పదేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కానీ ముప్పై రోజులు కాక ముందే విమర్శలు చేస్తున్నారు’’ అంటూ సీతక్క మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment