
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రభుత్వ పథకాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. గురువారం ఆమె తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పథకమైన అమలు చేశారా అని ప్రశ్నించారు. రుణ మాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారు. ఏ ఒక్క వర్గానికి కూడా చంద్రబాబు న్యాయం చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బాబు అమలు చేయలేదని మంత్రి మండిపడ్డారు.
‘‘మహిళలపై చంద్రబాబు హయాంలో ఎన్ని దాడులు జరిగాయో చూశాం. రిషితేశ్వరి, వనజాక్షిలాంటి వారిపై అకృత్యాలు చంద్రబాబు హయాంలో ఎన్నో జరిగాయి. సీఎం జగన్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 30 లక్షల మంది మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మహిళలకు నిజమైన స్వావలంబన జగన్ పాలనలోనే దక్కింది. మహిళలకు రాజకీయంగా కూడా అనేక పదవులు దక్కాయి. ఎన్నికలు దగ్గర పడటంతో ఎల్లో మీడియా ఈ 16 నెలలూ ఇంకా అధికంగా విషం చిమ్మేలా వార్తలు రాస్తారు. కానీ జనం నమ్మే పరిస్థితి లేదు’’ అని మంత్రి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు.
చదవండి: అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం: సీఎం జగన్