సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను మంగళవారం వాడవాడలా ప్రజలంతా ఘనంగా నిర్వహించి, అభిమానాన్ని చాటుకోవడాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు వికృత రాజకీయాలకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. సీఎం జగన్ జన్మదిన వేడుకల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనే లక్ష్యంతో చంద్రబాబు మంగళవారం టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వంపై నోరుపారేసుకున్నారని అన్నారు. క్రిస్టియన్ ఎయిడెడ్ విద్యా సంస్థలను దోచుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశానని బాబు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంతపాడుతున్నాయని చెప్పారు. అంబటి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఏమీ చేయకున్నా..
అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకపోయినా చేసినట్లుగా చంద్రబాబు కలలు కంటుంటారంటూ అంబటి ఎద్దేవా చేశారు. ‘హైదరాబాద్‌కు అవుటర్ రింగ్ రోడ్డు వేయాలని బాబు కలలు కంటే.. దానికి పునాది రాయి వేసి, పూర్తి చేసి, ప్రారంభించింది వైఎస్సార్. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో పీవీ నరసింహారావు ప్లైఓవర్ నిర్మించాలని బాబు కలలు కంటే.. దానికి పునాది రాయి వేసి, పూర్తి చేసి, జాతికి అంకితం చేసింది వైఎస్సార్. హైదరాబాద్‌కు ఐటీ తెచ్చానని చంద్రబాబు కలలు కంటే.. అక్కడ ఐటీ రంగం వర్ధిల్లేలా చేసింది వైఎస్సారే’ అని చెప్పారు. ‘2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే.. సీఎం జగన్ ఈ 30 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.1.16 లక్షల కోట్లు జమ చేశారు’ అని చెప్పారు. తాము ఏది చేశామో వైఎస్సార్, సీఎం జగన్‌లు చెబితే.. చంద్రబాబు మాత్రం ఇది చేయాలనుకున్నా అని అంటుంటారని ఎద్దేవా చేశారు.
నాడు దళితులను కించపరిచి..
గుంటూరులో మద్యం కోసం వ్యక్తిగతంగా గొడవ జరిగి, దళితుడిపై దాడి జరిగితే.. దాన్ని వైఎస్సార్‌సీపీపై నెడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితులను కించపరిచిన చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గాన్ని వైఎస్సార్‌సీపీ నుంచి దూరం చేసేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి అధిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పి మళ్లీ ఇప్పుడు హోదా కావాలని కోరడం విడ్డూరంగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు.
చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment