సమావేశంలో అనంతరం మీడియా ముందు ఆలింగనం చేసుకున్న మల్లురవి, జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసమ్మతి దుమారం టీకప్పులో తుపానులా ముగిసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై శుక్రవారం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన శనివారం వెనక్కు తగ్గారు.
మరోమారు పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాతో మాట్లాడనని పార్టీపెద్దలకు హామీ ఇచ్చారు. తాను అలా వ్యాఖ్యానించడం తప్పేనని అంగీకరించారు. దీంతో జగ్గారెడ్డి అసమ్మతి వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడినట్టేనని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
అధిష్టానం ఆరా..: రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన ఏం మాట్లాడారన్న దానిపై అధిష్టానం ఆరా తీసింది. ఈ విషయమై ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాసకృష్ణన్‌లతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ మాట్లాడారు. జగ్గారెడ్డిని పిలిపించి మాట్లాడాలని సూచించారు.
దీంతో శనివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షుల సమావేశానికి హాజరైన జగ్గారెడ్డితో బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌లు ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ వ్యవహారాలను అంతర్గత వేదికలపై చర్చించుకోవాలే తప్ప మీడియాతో మాట్లాడడం సరికాదని వారు జగ్గారెడ్డికి సూచించారు.
పెద్దల మాటను గౌరవిస్తా: జగ్గారెడ్డి
పార్టీ విషయాలు బయట మాట్లాడవద్దని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసిన సూచనను గౌరవిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని నాయకులం అన్నదమ్ములం లాంటివాళ్లమని, కూర్చుని మాట్లాడుకుని కలిసి పనిచేసుకుంటామని, టీఆర్‌ఎస్, బీజేపీలపై యుద్ధం చేస్తామని అన్నారు. ‘మీడియాతో పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడాను.
ఇకపై మాట్లాడను. అది నేను ఒప్పుకున్నా. పార్టీకి సంజాయిషీ ఇచ్చాను. అలాం టి పరిస్థితి మళ్లీ రాకుండా జాగ్రత్త తీసుకుంటా’అని జగ్గారెడ్డి వెల్లడించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ జగ్గారెడ్డిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయిందన్నవార్తలో నిజం లేదన్నారు. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు కూడా చర్చించదగినవేనని, ఈ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడిందని, ఈ విషయంలో పార్టీ కేడర్ గందరగోళానికి గురికావద్దని ఆయన వ్యాఖ్యానించారు.
మల్లు రవి వర్సెస్ జగ్గారెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షుల సమావేశంలో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా సమీక్ష జరిపారు. అయితే, ఈ భేటీలో జగ్గారెడ్డి, మల్లు రవిల మధ్య మాటల యుద్ధం జరిగింది.
రేవంత్‌నుద్దేశించి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్లు రవి అభ్యంతరం తెలపగా జగ్గారెడ్డి కూడా ఇందుకు దీటుగానే స్పందించారు. బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్‌లు సర్దిచెప్పడంతో శాంతించారు. కాగా, బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పకడ్బందీగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సమావేశంలో తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment