బోధన్: తెలంగాణ గడ్డపై ఉద్యమ నేత కేసీఆర్‌ను రాజకీయంగా ఓడించాలంటే ఎవరి తరం కాదని, మళ్లీ కేసీఆరే పుట్టాలని.. అయితే అది సాధ్యమయ్యే పని కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎన్‌ఎస్‌ఎఫ్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన బీఆర్‌ఎస్ మహా యువగర్జన సభలో ఆమె ప్రసంగించారు. కేసీఆర్ ఏం చేశారని చాలామంది మాట్లాడుతున్నారని, ఆయన ఎవరూ అడగకుండానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులకు కొట్లాటలకు, ముచ్చట్లకే సమయం సరిపోవడం లేదని, అలాంటివారు ప్రజల గురించి ఏం ఆలోచిస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే నన్నారు. ఓడిపోతామనే నిరాశలో కాంగ్రెస్ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. మొన్న టీపీసీసీ చీఫ్ రేటెంతరెడ్డి (రేవంత్‌రెడ్డి) ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలన్నారని, రైతుబంధును బిచ్చమేస్తున్నారని అన్నారని కవిత పేర్కొన్నారు.
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 24 వేల ఉద్యోగాలిస్తే, అందులో తెలంగాణ వాటాకు 10 వేలు ఉద్యోగాలొచ్చాయన్నారు. కానీ పదేళ్ల కేసీఆర్ పాలనలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఎమ్మెల్యే షకీల్, జెడ్పీవైస్ చైర్‌పర్సన్ రజితాయాదవ్, బీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు, ప్రజాప్రతిని«ధులు సభలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment