
సాక్షి, ఇల్లెందు: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీచేస్తానని, ఆయన నిర్ణయమే తనకు శిరోధార్యమని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించానని, పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తొలి బంజారా మహిళగా తనకు గుర్తింపు లభించిందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కార్యకర్తలు, ప్రజలు తనపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు అసెంబ్లీ స్థానాలు తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలందరికీ సుపరిచితురాలినేనని పేర్కొన్నారు. కాగా, ఎస్టీ జాబితా నుంచి బంజారాలను తొలగించాలన్న ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.
గిరిజనులకు నేరుగా లబ్ధి చేకూరేవిధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఈ తరుణంలో బాపురావు వైషమ్యాలు రెచ్చగొట్టడం దారుణమని అన్నారు. అంతకుముందు ఎంపీ కవిత ఇటీవలి వర్షాలకు కూలిపోయిన ఇళ్లను సందర్శించి, బాధితులను పరామర్శించారు.
ఇది కూడా చదవండి: మాపై దుష్ప్రచారం కాంగ్రెస్‌లోని ఓ కీలక నేత పనే