సాక్షి, తాడేపల్లి: రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్‌లోనే రఘురామ పని చేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘రఘురామకృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. కుటుంబసభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్డ్ చేసేందుకు యత్నిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంత హడావిడి చేయని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం హైరానా పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందన్న మిథున్‌రెడ్డి.. కేవలం రమేష్ ఆస్పత్రిలోనే ట్రీట్‌మెంట్ జరగాలనడం సరికాదని పేర్కొన్నారు.
అసత్య ఆరోపణలు చేశారు: బాలశౌరి
ఎంపీ కాకముందే రఘురామకృష్ణరాజు ఐదుసార్లు పార్టీ మారారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి అన్నారు. పార్టీలో రఘురామకృష్ణరాజుకు సముచితస్థానం ఇచ్చామని, అయినప్పటికీ సీఎం, మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, పోలీసులు కొట్టారంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
టీడీపీ స్క్రిప్టు ప్రకారమే: శ్రీకృష్ణ దేవరాయలు
రఘురామకృష్ణరాజు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. టీడీపీ స్క్రిప్ట్‌ను రఘురామకృష్ణరాజుతో చదివిస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిందే రఘురామకృష్ణరాజు చేస్తున్నారన్న ఎంపీ.. . ట్రీట్‌మెంట్ కోసం రమేష్ ఆస్పత్రికే ఎందుకు తీసుకెళ్లాలని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment