బాద్‌షాల అరాచకాలు కన్పించ లేదా? | Sakshi
Sakshi News home page

బాద్‌షాల అరాచకాలు కన్పించ లేదా?

Published Mon, Apr 29 2024 4:56 AM

Narendra Modi comments on Rahul Gandhi

రాహుల్‌పై మోదీ ధ్వజం

బెళగావి/సిర్సీ/దావణగెరె:  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధాని నరేంద్ర∙మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మన దేశానికి చెందిన రాజులు, మహారాజులను కించపర్చిన రాహుల్‌ నవాబులు, నిజామ్‌లు, సుల్తాన్లు, బాద్‌షాలు సాగించిన అరాచకాలపై మాత్రం నోరుమెదపడం లేదని మండిపడ్డారు. కేవలం బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలతో లబ్ధి పొందడానికి రాహుల్‌ ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కర్ణాటకలోని బెళగావి, దావణగెరె, ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీ, హోస్పేట్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. 

మన దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాట గాథలను కాంగ్రెస్‌ పార్టీ పాలనలో బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రాశారని, ఆ పాపాన్ని రాహుల్‌ గాంధీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారని విమర్శించారు. భారతదేశ రాజులు, మహారాజులు పేద ప్రజలపై క్రూరమైన అణచివేత, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఆస్తులు, భూములు బలవంతంగా లాక్కున్నారంటూ రాహుల్‌ ఇటీవల ఆరోపించారని గుర్తుచేశారు. ఛత్రపతి శివాజీ, కిత్తూరు రాణి చెన్నమ్మ వంటి గొప్ప పాలకులను రాహుల్‌ అవమానించారని చెప్పారు. దేశ చరిత్రలో నవాబులు, నిజామ్‌లు, సుల్తాన్లు, బాద్‌షాలు సాగించిన అఘాయిత్యాలు, దారుణాల గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్‌ రాజకుమారుడి నోటికి తాళం పడుతోందని ఎద్దేవా చేశారు. 

మొఘల్‌ రాజు ఔరంగజేబు మన ఆలయాలను అపవిత్రం చేశాడని, కూలి్చవేశాడని అన్నారు. అలాంటి ఔరంగజేబును ఆరాధించే పారీ్టలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని ఆక్షేపించారు. ఔరంగజేబు దుశ్చర్యలపై రాహుల్‌ ఏనాడూ మాట్లాడలేదన్నారు. రాజులు, మహారాజులు మన దేశానికి ఎన్నో సేవలు చేశారని, వారి త్యాగాలు మరువలేమని పేర్కొన్నారు. రాజులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉన్న ధైర్యం సుల్తాన్లకు వ్యతిరేకంగా మాట్లాడడానికి రాహుల్‌కు లేదని విమర్శించారు. 

కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు మైండ్‌సెట్‌ ఆ పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తోందని వెల్లడించారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) మద్దతు  తీసుకుంటోందని ఆరోపించారు. వయనాడ్‌లో నెగ్గడానికి పీఎఫ్‌ఐకి లొంగిపోతారా? అని రాహుల్‌ని ప్రశ్నించారు.  

ప్రజల ఓట్లతోనే నాకు ధైర్యం
ఓటు బ్యాంకు రాజకీయాలు మరింత నీచంగా, విధ్వంసకరంగా తయారవుతున్నాయని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ చివరి క్షణం వరకూ ఎన్నో అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. ఆలయ నిర్మాణం జరగకుండా కాంగ్రెస్, దాని కోటరీ 70 ఏళ్లపాటు కుట్రలు సాగించాయని దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి రోజే అయోధ్యలో ఆలయ నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, అప్పటి పాలకులు ఆ పని చేయలేదన్నారు.

 నిర్ణయం తీసుకొని, అమలు చేయడానికి 56 అంగుళాల ఛాతీ(మోదీ) కావాల్సి వచి్చందన్నారు. ప్రభుత్వ సొమ్ముతో గానీ, పన్ను చెల్లింపుదార్ల డబ్బుతో గానీ ఆ ఆలయం నిర్మించలేదని, శ్రీరాముడి భక్తుల విరాళాలతోనే ఆలయ నిర్మాణం జరిగిందని వివరించారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహా్వనం అందజేస్తే కాంగ్రెస్‌తోపాటు కొన్ని పారీ్టలు తిరస్కరించాయని గుర్తుచేశారు. ఆ పార్టీలను ఎన్నికల్లో తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకాలని, మరింత బలం చేకూర్చాలని కోరారు.

వారసత్వ పన్నును ఆమోదించను  
కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే వారసత్వ పన్నుతో ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుందంటూ ప్రజలను ప్రధానమంత్రి అప్రమత్తం చేశారు. పిల్లల కోసం ఆదా చేసుకున్న డబ్బులను సైతం లాక్కుంటారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు 45 శాతం ఆస్తులను మాత్రమే బదిలీ చేసే అవకాశం ఉంటుందని, మిగతా 55 శాతం ఆస్తులను కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ఓటు బ్యాంక్‌కు కట్టబెడుతుందని పేర్కొన్నారు. 

అయితే, తాను జీవించి ఉన్నంతకాలం ఇలాంటి వారసత్వ పన్ను ఆమోదించే ప్రసక్తే లేదని మోదీ తేలి్చచెప్పారు. మీ ఉద్దేశాలు వదిలేసుకోండి అంటూ కాంగ్రెస్‌         పారీ్టకి హితవు పలికారు. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువులపై దాడులు పెరిగిపోయాయని ప్రధానమంత్రి అన్నారు.  

2014 కంటే ముందు బ్రోకర్ల రాజ్యం  
కొన్ని దేశాలు, సంస్థలు మన దేశం, మన ప్రభుత్వం బలహీనపడాలని కోరుకుంటున్నాయని, అలాగైతే లాభపడొచ్చని, ఆటలు సాగించుకోవచ్చని భావిస్తున్నాయని మోదీ చెప్పారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఆయా దేశాలకు, సంస్థలకు ఇష్టం లేదన్నారు. భారత్‌ బలమైన దేశంగా ఎదగడం కొందరికి కంటగింపుగా మారిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉంటే అవినీతికి పాల్పడడం, దోచుకోవడం సాధ్యం కాదని కొన్ని దుష్టశక్తులు భావిస్తున్నాయని పేర్కొన్నారు.

2014 కంటే ముందు బ్రోకర్ల రాజ్యం నడిచిందని, ఢిల్లీ పవర్‌ కారిడార్లలో వారే అధికారం చెలాయించారని గుర్తుచేశారు. ఢిల్లీలోని హోటళ్లలో సంవత్సరాల తరబడి తిష్ట వేసి లాబీయింగ్‌ చేస్తూ ఉండేవారని తెలిపారు. 2014లో తాము అధికారంలోకి వచి్చన తర్వాత పవర్‌ కారిడార్లను శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టామని వివరించారు. బ్రోకర్లకు, లాబీయిస్టులకు అక్కడ స్థానం లేకుండా చేశామని చెప్పారు. బీజేపీని అణగదొక్కడం సాధ్యం కాదన్న సంగతిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తెలుసుకోవాలన్నారు. 

Advertisement
Advertisement