ముంబై: లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. హర్యానా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రకు వరుసగా అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ హడావిడీ నెలకొంది. గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతున్నాయి
ఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే.. అధికార, విపక్షాలు తమ ఫోకస్ పెంచాయి. తాజాగా మహయుతి ప్రభుత్వంలోని పార్టీల మధ్య (బీజేపీ, శివసనే,ఎన్సీపీ) సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. మూడు పార్టీలు సైతం తమ పట్టు నిలుపుకునేందుకు ఎక్కువ స్థానాల్లో పోటీ కోరినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు అధికార కూటమిలో సీట్ల పంపకాల చర్చ అప్పుడే కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 140 నుంచి 150 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 55 స్థానాల్లో పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా చిన్న మిత్రపక్షాలకు మూడు సీట్లు కేటాయించనున్నట్లు వినికిడి.
అయితే ప్రభుత్వానికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో 30 స్థానాలను గెలుచుకొని సత్తా చాటాయి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌చంద్ర), శివసేన(ఉద్దవ్). లోక్‌సభ ఎన్నికల జోష్‌నే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి కూటమి తమ సీట్ల భాగస్వామ్యాన్ని ఇంకా ప్రకటించలేదు.
మరోవైపు కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమైన ఎన్డీయే కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి అధికారాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తోంది. కాగా గత 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అవిభక్త శివసేన కూటమి అఖండ విజయం సాధించింది.అయితే సీఎం పదవిపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది.
కానీ కొంతకాలానికే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. 2022లో శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే బయటకు వచ్చి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కొంతకాలానికే ఎన్సీపీని చీల్చుతూ అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment