
సాక్షి,న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడం వల్ల నల్లధనానికి ద్వారాలు తెరుచుకున్నట్లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓ నేషనల్ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల అవసరం రాజకీయ పార్టీలకు ఎంత అవసరమో గుర్తు చేశారు.
‘రాజకీయ పార్టీలు నిధుల్ని సేకరించేందుకు అందుబాటులోకి తెచ్చిందే ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకం. భారత ఆర్థిక వ్యవస్థను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి’ అని గడ్కరీ అన్నారు.
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు నిర్ణయంపై తాను వ్యాఖ్యానించబోనన్న గడ్కరీ.. నిషేధంలోని లోపాల్ని ఎత్తి చూపారు. ఎలక్టోరల్ బాండ్లను నిషేధిస్తే నల్లధనం రూపంలోనే డబ్బు చేతులు మారుతుందని చెప్పారు. ‘ఎలక్టోరల్ బాండ్లను సంపన్నులు కొనుగోలు చేస్తారు. ఆ సంపన్నులు కాంట్రాక్టర్లు అవుతారు. వ్యాపారం లేదా పరిశ్రమల వృద్ది కోసం ఉపయోగిస్తారు. కాబట్టి దానికి (క్విడ్ ప్రోకో) లింక్ చేయడం సరికాదు అని సూచించారు.