ఎన్నికల గుర్తు కారణంగా పార్టీ లేదా అభ్యర్థి ఓడిపోయారంటూ వచ్చే వార్తలను మనం ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. ఎన్నికల గుర్తులు పార్టీలకు ప్రాణం లాంటివి. ఎన్నికల గుర్తును చూసి ఓటువేసేవారి సంఖ్య అధికంగానే ఉంటుందనే మాట వినిపిస్తుంటుంది. ఓటు వేసే సమయంలో గుర్తులు కనిపించకుంటే ఓటు వేయకుండానే వెనుదిరిగేవారు కూడా ఉన్నారట.
అవి 1957 సాధారణ ఎన్నికలు.. పంజాబ్‌లో ఒక అభ్యర్థి తన ఎన్నికల చిహ్నంగా కోడిని ఎంచుకున్నాడు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన తన ఎన్నికల గుర్తు గురించి అందరికీ తెలియజేయాలనుకున్నాడు. ఇందుకోసం ఆయన ఆ ప్రాంతంలో వందల కోళ్లను వదిలాడు. అయితే ఎక్కడినుంచో వచ్చిన ఒక నక్కల గుంపు ఆ కోళ్లను వేటాడింది. కొన్ని కోళ్లు ఎలాగోలా నక్కల బారి నుంచి తప్పించుకున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కడి ఓటర్లు.. నక్కల బారి నుంచి ఎన్నికల గుర్తునే కాపాడుకోలేని అభ్యర్థి మమ్మల్ని ఎలా కాపాడతాడని ఎదురుతిరిగారట.
1957 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఇటువంటి విచిత్ర ఉదంతం చోటుచేసుకుందట. యూపీలోని ఓ పోలింగ్ బూత్‌కి వచ్చిన కొందరు పడవ నడిపేవారు ఓటు వేయకుండానే వెనుదిరిగారట. వారిని కారణం అడిగితే లోపల బ్యాలట్ పేపర్‌పై బోటు గుర్తు లేదని, అందుకే ఎవరికీ ఓటు వేయకుండా వెళ్లిపోతున్నామని చెప్పారట.
Comments
Please login to add a commentAdd a comment