మిత్రపక్షాలు మోసం చేశాయి!  | PMK Party Leader Ramadoss Comments On BJP And AIADMK In Tamilnadu | Sakshi
Sakshi News home page

Tamilnadu: మిత్రపక్షాలు మోసం చేశాయి! 

Published Tue, Dec 14 2021 1:47 PM | Last Updated on Tue, Dec 14 2021 1:47 PM

PMK Party Leader Ramadoss Comments On BJP And AIADMK In Tamilnadu - Sakshi

రాందాసు

సాక్షి, చెన్నై(తమిళనాడు): అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలు చేసిన మోసంతో ఘోరంగా ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని, ఇకనైనా వన్నియర్లు ఐక్యంగా సాగాలని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే – బీజేపీ కూటమితో కలిసి ఎన్నికల్లోకి పీఎంకే వెళ్లిన విషయం తెలిసిందే. 23 స్థానాల్లో పోటీ చేసిన పీఎంకే ఐదు చోట్ల గెలిచింది.

ఈ పరిస్థితుల్లో సేలంలో సోమవారం పార్టీ కార్యవర్గ సమావేశంలో అసెంబ్లీ  ఎన్నికల ఫలితాలపై  రాందాసు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తాను ప్రజాజీవితంలోకి వచ్చి 42 ఏళ్లు అవుతోందని, అయితే, తన సామాజిక వర్గానికి సరైన మార్గదర్శకం చేయలేదా..? అనే ఆవేదన కల్గుతోందన్నారు. వన్నియర్‌ సామాజిక వర్గం రెండు కోట్ల మంది ఉన్నారని గుర్తు చేస్తూ, ఐక్యంగా ఉండి ఉంటే, అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండే వాళ్లమని పేర్కొన్నారు.

పక్క రాష్ట్రాల్లోని కొన్ని సామాజిక వర్గాలను చూసి ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉందని హితవు పలికారు. ఉద్యమాలతో 10.5 శాతం రిజర్వేషన్‌ దక్కించుకుంటే, కోర్టు రూపంలో అడ్డంకులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒంటరిగా పోటీ చేసిన సమయంలో సామాజిక వర్గం అంతా తన వెన్నంటే ఉన్నట్టు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేక పోవడానికి కూటముల ఏర్పాటు విషయంలో తాను చేసిన తప్పిదం కూడా ఉన్నట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.  

అన్భుమణికి ఒక్క చాన్స్‌ 
ఎన్నికల్లో కనీసం 15 చోట్ల విజయకేతనం ఎగుర వేసి ఉండే వాళ్లమని, అయితే, కూటమిలోని మిత్ర పక్షాల నేతలు మోసం చేశారని అన్నాడీఎంకే కూటమిపై రాందాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా, సామాజిక వర్గం కోసం, ఆ అభ్యర్థి కోసం పాటు పడాల్సిన అవసరం  ఉందని, అయితే, ఇక్కడ మోసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, మార్పు మార్గంగా ముందుకు వెళ్లనున్నామని, దయ చేసి అన్భుమణి రాందాసుకు ఒక్క చాన్స్‌ ఇవ్వాలని సామాజిక వర్గం నేతలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్, పురపాలక ఎన్నికల్లో నైనా ఐక్యంగా సత్తా చాటుదామని , కొత్త మార్గంలో పయనిద్దామని, అన్భుమణిని ఆదరిద్దామని వారసుడికి నేతల మద్దతు కూడగట్టే పనిలో రాందాసు నిమగ్నం అయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జికే మణి, ఎమ్మెల్యేలు అరుల్, సదాశివం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.  

చదవండి:  మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement