టీడీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో ఆశావహుడు పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, ఆయన తండ్రి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తమ ఆక్రోశం వెళ్లగక్కారు. 20 ఏళ్ల పాటు ప్రజలతో అనుబంధం ఉన్న తమ కుటుంబాన్ని కాదని.. కనీస పరిచయం లేని ఆమెను బరిలో ఎలా నిలుపుతారంటూ టీడీపీ అధినేతలపై మండిపడిన వీరు అంతలోనే మౌనం దాల్చారు. ఇలా మెత్తపడటంతో వీరి తీరును జీర్ణించుకోలేని టీడీపీ కేడర్ అయోమయంలో పడింది.
కోవూరు: విజయమే లక్ష్యంగా టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలకై నా వెనుకాడటంలేదు. కుదిరితే వెన్నుపోటు.. కుదరకపోతే డబ్బు సంచులనే రీతిలో ముందుకెళ్తోంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసుడిగా టీడీపీలో అరంగ్రేటం చేసిన తనయుడు పోలంరెడ్డి దినేష్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును ఆ పార్టీ అధిష్టానం ప్యాకేజీతో సమాధి చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆశలు ఆవిరి
టీడీపీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనంటూ దినేష్‌రెడ్డి దాదాపు రెండున్నరేళ్లుగా ప్రచారం చేసుకున్నారు. రాజకీయాల్లో యువతరానికి ప్రాధాన్యమంటూ చంద్రబాబు, లోకేశ్ తమ ప్రచారాలతో ఊదరగొట్టారు. వీరి వ్యాఖ్యలతో తనకు ఇక తిరుగులేదనే ఊహల పల్లకిలో దినేష్‌రెడ్డి విహరించారు. అయితే అనూహ్యంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్‌ను ఖరారు చేసి తమ చేష్టలతో దినేష్‌రెడ్డిని నేలపైకి తీసుకొచ్చారు.
మొదట్లో ధిక్కారస్వరం
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కోవూరు అభ్యర్థిగా ఖరారు చేయడంతో తండ్రీకొడుకులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, దినేష్‌రెడ్డి హతాశులయ్యారు. టీడీపీ నిర్వహించిన నాలుగు సర్వేల్లోనూ దినేష్‌రెడ్డి తొలి స్థానంలో ఉన్నా.. ధనబలం, రాజకీయ పరపతితో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టికెట్‌ను కేటాయించి తమ గొంతు కోశారని ఆత్మీయ సమావేశంలో ఫైరయ్యారు. 2014 ఎన్నికలకు ముందు కోవూరులో టీడీపీకి అభ్యర్థి లేకపోతే.. కాంగ్రెస్‌లో ఉన్న తనను చంద్రబాబు బతిమిలాడి పార్టీ టికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారం కోల్పోయాక పార్టీ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చామని చెప్పారు. లోకేశ్ నిర్వహించిన యువగళం యాత్రకు దాదాపు రూ.15 కోట్ల వరకు ఖర్చు పెట్టామని, తమకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని అల్టిమేటమిచ్చారు.
ఫలించిన ‘డబ్బు’ సంప్రదింపులు
ఈ తరుణంలో పోలంరెడ్డితో పార్టీ పెద్దలు సంప్రదింపులు జరిపారు. రూ.30 కోట్లకు బేరం పెట్టగా, చివరికి రూ.20 కోట్లకు ఓకే అన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో పోలంరెడ్డి మౌనం దాల్చారని తెలుస్తోంది. అయితే ఇవ్వాల్సిన మొత్తంలోనూ రూ.ఐదు కోట్ల మేర పంగనామం పెట్టడంతో పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరమయ్యారనే టాక్ వినిపిస్తోంది.
దిక్కుతోచని స్థితిలో కేడర్
పార్టీ అధిష్టానం పునరాలోచన చేయకపోతే ఇండిపెండెంట్‌గా దినేష్‌రెడ్డి పోటీ చేయాలని.. తామంతా టీడీపీకి కాకుండా ఆయనకే మద్దతుగా నిలుస్తామని కేడర్ చెప్పారు. ఎవరు పోటీ చేసినా తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. అయితే కేడర్ వ్యాఖ్యలపై పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మౌనంగా ఉన్నారు. ఈ తరుణంలో కేడర్‌లో స్తబ్దత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment