
ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని జనగామ గులాబీ గూటిలో ముసలం ముదిరిందా? సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతుంది ఎవరు? ఇంట్లో పోరుతోనే సతమతం అవుతున్న గులాబీ ఎమ్మెల్యేకు ఈసారి టిక్కెట్ హుళక్కేనా? గ్రూప్ రాజకీయాలతో అవస్థలు పడుతున్న గులాబీ గూటిలో పుల్లలు పెడుతున్నది ఎవరు? అసలు జనగామ జగడానికి కారణం ఎవరు?..
జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యతిరేక వర్గం తాజా ఆడియో సంభాషణ కలకలం సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి తన సీటును పదిలపర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి.. మరోవైపు పార్టీలో వ్యతిరేక వర్గం ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇదే సమయంలో స్వపక్షంలోని స్థానికులు గ్రూప్ కట్టి స్థానికతను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ ఇందుకు ఆజ్యం పోస్తున్నట్లు వైరల్‌గా మారిన తాజా ఆడియో స్పష్టం చేస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్థానికేతరుడు కావడంతో.. మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కలిసేందుకు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పలువురు నేతలతో సంప్రదింపులు జరపడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
జనగామ సీటు కాపాడుకునేందుకు యాదగిరిరెడ్డి ప్రయత్నిస్తుండగా.. ఆయన సీటుకు ఎర్త్ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇదే సమయంలో నర్మెట్ట జెడ్పీటీసీ సభ్యుడు ఎం.శ్రీనివాస్‌తో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. స్థానికుడైన పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటివ్వాలని కోరదామని, పల్లాకు కూడా ఈ విషయం చెప్పాలంటూ ఉన్న ఆడియో వైరల్ కావడంతో నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేగింది. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత కాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇటీవల తన కూతురు తుల్జా భవానిరెడ్డి తండ్రి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా చేర్యాలలో తండ్రి ఇచ్చిన స్థలాన్ని కూడా స్థానిక మున్సిపాలిటీకి ఇచ్చేశారు.
టికెట్ నాదంటే నాదే..
ఓ వైపు ఇంటిని చక్కబెట్టుకుంటూ.. సీటు కాపాడుకోవడానికి అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుంటున్న తరుణంలో స్థానికంగా పార్టీలో కూడా కుంపటి రాజుకుంది. ముత్తిరెడ్డి అంటే గిట్టని కొందరు నేతలు ఈసారి ఎన్నికల నుంచి ఎలాగైనా ఆయన్ను తప్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో సన్నిహితంగా వ్యవహరిస్తూ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానిస్తున్నారు. తన వెనుక చాలా జరుగుతున్నా.. తన పని తాను చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి..సిట్టింగ్ గా ఉన్న టికెట్ నాకే, గెలిచేది నేనే అంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో తెరపైకి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు రావడంతో నియోజకవర్గంలో కలకలం రేగింది. గ్రూప్ రాజకీయాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి.
జనగామ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు పుల్లల రాయుడిగా పిలుచుకునే ఎమ్మెల్సీయే అసలు కారణమని ప్రచారం జరుగుతోంది. పార్టీ అగ్ర నేతలకు దగ్గరగా ఉండే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లకు ఎసరు పెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గులాబీ పార్టీలో టాక్ నడుస్తోంది. మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు ఆయనే కారణమని భావిస్తున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యేలు తమ సీటు కాపాడుకుంటారో.. లేక పుల్లల రాయుడి దెబ్బకు పక్కకు తప్పుకుంటారో చూడాలి.
ఇది కూడా చదవండి: ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు: కేసీఆర్ సీరియస్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment