సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రోజూరోజుకి క్షీణిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో గత 70 ఏళ్లుగా నిర్మించినవి మోదీ తన స్నేహితులకు పంచిపెడుతున్నారని దుయ్యబట్టారు. జీడీపీ పెరగడమంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమేనా అని ఆయన ప్రశ్నించారు. వీటి ధరలను పెంచడం ద్వారా గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి రూ.23లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదని, అయితే ప్రైవేటీకరణ ప్రణాళికకు ఓ పద్దతి ఉంటుందని ఆయన అన్నారు. రైల్వేలు భారతదేశానికి వెన్నుముక వంటివని, రైల్వేల అమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకిస్తుందన్నారు.
చదవండి: వంట గ్యాస్ ధర ఎందుకు పెరుగుతుందో ప్రధాని చెప్పాలి: రాహుల్
2014 నుంచి అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గుతున్నా భారత్‌లో మాత్రం పెరిగిపోతున్నాయన్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం భారతదేశ ఆస్తులు, సంస్థలను అమ్మేస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలతో రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, వేతన జీవులు, చిన్న మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి దిగజారిపోతోందని, మోదీకి చెందిన నలుగురైదుగురు మిత్రులకు మాత్రమే లాభం చేకూరుతోందని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment