సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వారిని సొంత గూటికి రప్పించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కసరత్తు చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా 20 నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని ఆయా నియోజకవర్గాల్లో బలం పెంచుకునే దిశలో ఆయన పావులు కదుపుతున్నారా? టీడీపీతో కలసి పనిచేసి తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లి, అక్కడ అసంతృప్తితో ఉన్న నేతలపై రేవంత్ కన్నేశారా? అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. పార్టీని బలోపేతం చేసే వ్యూహంపై కసరత్తు చేస్తున్న రేవంత్ మొదటి దశలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతలతో ఇప్పటికే మంతనాలు పూర్తి చేశారని, ఇతర జిల్లాల నేతలతో కూడా ప్రాథమిక చర్చలు జరిపారని, త్వరలోనే వారినీ పార్టీలోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
ఆ పార్టీలోకి వెళ్లాక ఏమైంది?
ఇటీవల కాంగ్రెస్ నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. పార్టీకి పట్టున్న 4 నియోజకవర్గాల నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న వీరంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ మంత్రి ముఖేశ్ కుమారుడు విక్రమ్‌గౌడ్, మాజీ మేయర్ బండా కార్తీక, ఆమె భర్త చంద్రారెడ్డి, శేరి లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నేత రవియాదవ్‌లున్నారు. కాషాయ శిబిరంలో వీరికి తగిన ప్రాధాన్యం లభించట్లేదనే నారాజ్‌లో ఉన్నారని సమాచారం. విక్రమ్‌గౌడ్‌కు జాతీయ స్థాయిలో పదవి ఇస్తామని చేర్చుకుని, ఆ తర్వాత బీజేపీ నేతలు పట్టించుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ నలుగురు నేతలతో రేవంత్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, వీరు త్వరలోనే సొంత గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో కలసి.. టీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు దాదాపు 40 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులు లేని పరిస్థితి ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి పట్టున్నప్పటికీ నడిపించే నాయకుడు లేక కేడర్ నిస్తేజంగా ఉందనే అభిప్రాయంతో రేవంత్ ఉన్నారు. అందుకే ఆయా నియోజకవర్గాలకు సారథులను వెతికే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు చెందిన పలు జిల్లాల్లో ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీలో ఉన్నప్పుడు తనతో సాన్నిహిత్యంగా ఉండి ఆ తర్వాత టీఆర్‌ఎస్, బీజేపీలో చేరిన నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించే పనిలో పడ్డారని సమాచారం. అందులో భాగంగానే చాడ సురేశ్‌రెడ్డి, బోడ జనార్ధన్, వీరేందర్‌గౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ వంటి నేతలతో ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలు ఇద్దరు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో నాయకుడు, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో నేత, రంగారెడ్డి జిల్లాలో అసంతృప్తిగా ఉన్న మరో ముఖ్య నేతతో ఇప్పటికే టచ్‌లోకి వెళ్లినట్లు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణ పరిధిలోని నల్లగొండ జిల్లా మినహా రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment