
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడని, ఆయన సమర్థత ఏంటో కేసీఆర్‌కు తెలుసునని మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్లే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ, కేటీఆర్ సీఎం పదవికి సమర్థుడు అయితే కేసీఆర్ అసమర్థుడా అని ప్రశ్నించారు.
ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లేసి గెలిపించారని, సీఎం ఎవరనేది ఆ కుటుంబ సమస్య అని చెప్పారు. కేటీఆర్ సీఎం అయితే కవిత, హరీశ్, సంతోష్‌లకే సమస్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందని కేసీఆర్ అనుకుంటే రసమయి బాలకిషన్‌ను సీఎం చేయాలని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కంటే ఎక్కువగా కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పోలేపల్లి ఎల్లమ్మపై ప్రమాణం చేసి చెప్పాలని, టీఆర్‌ఎస్ చెబుతున్నట్టు కొడంగల్ అభివృద్ధి వారి హయాంలో జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు: లిమిటెడ్ కంపెనీలో బతుకుతున్నా...
సాక్షి, మహబూబాబాద్: అధికార పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను లిమిటెడ్ కంపెనీలో బతుకుతున్నానని, మాట, పాటను అదుపులో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నానని వాపోయారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆదివారం మహబూబాబాద్‌లో ప్రముఖ కవి జయరాజు తల్లి భోగిళ్ల అచ్చమ్మ సంతాప సభలో నటుడు ఆర్.నారాయణమూర్తితో కలసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ ‘‘ఎవరు ఏమనుకున్నా నేను నిక్కచ్చిగా చెబుతున్నా. తెలంగాణ వచ్చినాక పాటల్లో మార్పు వచ్చింది. వ్యక్తుల చుట్టూ పాటలైనాయి. పండుగలు పబ్బాలు వాళ్ల నెత్తి మీదకే పోతున్నాయి. నాకు ఒక్కోసారి బాధనిపిస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే.. కలాలు, గళాలు మౌనంగా ఉంటే అది కేన్సర్ కంటే ప్రమాదకరమైంది. ప్రతి కవి, గాయకుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది’’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment