సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్‌పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్‌పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్‌పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్‌కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్‌చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్‌కుమార్‌కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్‌కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్‌బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్‌చెరులో చివరి నిమిషంలో బీఎస్‌పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు.
ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్‌కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్‌కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది.
ప్రవీణ్‌కుమార్‌కు నిరాశ
బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమా ర్‌కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్‌ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment