రేవంత్‌రెడ్డి క్షమాపణ కోసం పట్టుబట్టిన విపక్షం
నల్లబ్యాడ్జీలతో నిరసన.. స్పీకర్ పోడియం వద్ద బైఠాయింపు
సభ కొనసాగినంత సేపూ నిలబడే ఉన్న సబిత, సునీత
గందరగోళం మధ్యే సభ నడిపించిన స్పీకర్
మాట్లాడనివ్వండి లేదా సస్పెండ్ చేయండి.. రూల్ పొజిషన్ లేవనెత్తిన అక్బర్
సభ ముగిశాక సీఎం చాంబర్ ఎదుట ధర్నాకు దిగిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
మార్షల్స్‌తో అసెంబ్లీ బయటికి తరలింపు
అక్కడా బైఠాయించడంతో బలవంతంగా తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురువారం కూడా శాసనసభ అట్టుడికింది. బీఆర్‌ఎస్ సభ్యులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పదేపదే స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. అక్కడే బైఠాయించారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ అసెంబ్లీ కొనసాగినంత సేపూ తమ సీట్ల వద్ద నిలబడే ఉండి నిరసన వ్యక్తం చేశారు.
తమకు మాట్లాడే అవకాశమివ్వాలని స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్షం నిరసనను అధికార పక్షం పట్టించుకోలేదు. గందరగోళం మధ్యే కీలకమైన స్కిల్ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి, చర్చ చేపట్టారు. సభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్ బాబు సభ నిర్వహణకు సహకరించాలంటూ పలుమార్లు బీఆర్‌ఎస్ సభ్యులను కోరారు.
నల్లబ్యాడ్జీలతో వచి్చ..
గురువారం బీఆర్‌ఎస్ సభ్యులంతా నల్లబ్యాడ్జీ లతో శాసనసభకు వచ్చారు. సభ ప్రారంభం కాగానే సబితను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలపై చర్చకు పట్టుబట్టారు. సబితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని వారు కోరి నా స్పీకర్ అనుమతించలేదు.
అదే సమయంలో స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టాలని మంత్రికి స్పీకర్ సూచించారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ పోడి యం వద్దకు దూసుకెళ్లారు. ‘సీఎం డౌన్ డౌన్.. సీఎం అహంకార పూరిత వైఖరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. సభ గందరగోళంగా ఉండగానే.. సీఎం రేవంత్ ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణపై ప్రకటన చేశారు. ఆ సమయంలో కాసేపు శాంతించిన విపక్ష సభ్యులు తర్వాత మళ్లీ నిరసన మొదలుపెట్టారు.
గందరగోళం మధ్య చర్చ ఎలా?: అక్బరుద్దీన్
సభలో గందరగోళం కొనసాగుతున్న సమయంలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ జోక్యం చేసుకున్నారు. సభలో ఎవరిపై అయినా వ్యాఖ్యలు చేసినప్పుడు.. స్పష్టత ఇచ్చే హక్కు వారికి ఉంటుందని రూల్ పొజిషన్ లేవనెత్తారు. విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమైనా ఇవ్వాలని, లేదా వారిని సస్పెండైనా చేయాలని సూచించారు.
ఇంత గందరగోళం మధ్య కీలకమైన అంశాలపై చర్చ సరికాదని స్పష్టం చేశారు. సభను దారిలో పెట్టాల్సిన బాధ్యత సభాపతికి, సభా నాయకుడికి ఉంటుందన్నారు. సభను వాయిదా వేసి విపక్ష, అధికారపక్ష సభ్యులతో మాట్లాడటం సాంప్రదాయమని.. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సభ కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. దీనికి స్పీకర్ బదులిస్తూ.. సభను అదుపులో పెట్టేందుకు తాను ఉదయం నుంచీ ప్రయతి్నస్తూనే ఉన్నానని చెప్పారు. తర్వాత కూడా నిరసనలు, నినాదాల మధ్యే సభ కొనసాగింది.
తనిఖీల నుంచి తరలింపు దాకా..
గురువారం ఉదయం అసెంబ్లీకి వచి్చన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. ప్లకార్డులు ఏవైనా తెస్తున్నారా అని ఆరా తీశారు. దీనిపై ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సభ ప్రారంభానికి పది నిముషాల ముందే నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలోకి వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. సుమారు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. సభ ముగిశాక అసెంబ్లీలోని సీఎం చాంబర్ ముందు ధర్నాకు దిగారు.
సుమారు అరగంట పాటు ఆందోళన చేయగా.. మార్షల్స్ రంగప్రవేశం చేసి ఎమ్మెల్యేలను అసెంబ్లీ భవనం బయటికి తరలించారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసులు కలి్పంచుకుని.. కేటీఆర్, హరీశ్‌రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, విజయుడు, మాణిక్‌రావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులను వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చివరికి అందరినీ బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌కు తరలించారు.
నేడు కూడా ఆందోళనకు నిర్ణయం
శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగియనున్న నేపథ్యంలో.. తమ మహిళా సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాలని బీఆర్‌ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తామని.. ఇందుకోసం మాట్లాడే చాన్స్ ఇవ్వాలని పట్టుబడతామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. తాను సీఎం నుంచి క్షమాపణ కోరుకోవడం లేదని.. మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నానని పేర్కొన్నారు. స్పీకర్‌కు తమ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment