మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలకు అవమానకరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఈ అవమానం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిలది మాత్రమే కాదని.. మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకే అవమానకరమని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. ‘‘మహిళా ఎమ్మెల్యేలను అకారణంగా, అసభ్యంగా హీనాతిహీనంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు అవమానించారు.
మహిళా ఎమ్మెల్యేలు ఎంతో కష్టపడి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. అంతేతప్ప రేవంత్ మాదిరిగా విన్యాసాలు చేస్తూ రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ల కుటుంబాలకు ఉన్న ఆదరణతో స్వశక్తితో రాజకీయాల్లో రాణిస్తున్నారు. అలాంటి మహిళలను పట్టుకుని నోటికి వచ్చినట్టు వాగడం సీఎం రేవంత్‌కు తగదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందన్నట్టుగా సీఎం మాట్లాడటం హేయమని మండిపడ్డారు. సీఎం కుర్చీలో కూర్చునేందుకు రేవంత్ అనర్హుడని, ఆయనకు ఆడబిడ్డల ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు.
భట్టికి ఎంత గుండె ధైర్యం?
‘‘ముఖ్యమంత్రి ఇట్లా ఉంటే.. ఉప ముఖ్యమంత్రి మమ్మల్ని ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చినవ్ అంటారా? మీరు ఏ ముఖం పెట్టుకుని వచ్చారో మేము కూడా అదే విధంగా అసెంబ్లీకి వచ్చాం. మా ఆడబిడ్డలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడటానికి డిప్యూటీ సీఎం భట్టికి ఎంత గుండె ధైర్యం?’’ అని కేటీఆర్ నిలదీశారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చినది ఇష్టమొచ్చినట్టు మాట్లాడటానికా అని ప్రశ్నించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నా ఎప్పుడైనా ఇలా మహిళలను అవమానించామా అని పేర్కొన్నారు. సీఎంను ఏకవచనంతో సంబోధిస్తే వెంటనే సరిచేసుకు న్నానని, అది కేసీఆర్ తమకు నేర్పిన సంస్కారమని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment