
నిన్నటి వరకు వలంటీర్లను తూలనాడింది చంద్రబాబే
తిరిగి జన్మభూమి కమిటీలను తేవాలన్నదే ఆయన ధ్యేయం
ఆ కమిటీల్లో సభ్యులనే వలంటీర్లను చేయాలనుకుంటున్నారు.. ఇది జరగని పని
మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం
బాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరిగింది.. మార్పులు ఉండవు: సజ్జల
సాక్షి, అమరావతి: వలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. నిన్నటి వరకు వలంటీర్లను తూలనాడిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రేమ చూపిస్తారంటే ఎవరూ నమ్మరని అన్నారు. సజ్జల బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గోనె సంచులు మోస్తారు, ఆడవారి వివరాలు సేకరిస్తారు, అర్ధరాత్రి తలుపులు కొడతారని వలంటీర్ల గురించి నిన్నటిదాకా అన్న చంద్రబాబు.. ఇప్పుడు వలంటీర్లను కొనసాగిస్తా, రూ.10 వేలు ఇస్తా అంటే వలంటీర్లు, జనం నమ్మరని చెప్పారు.
వలంటీర్లపై ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాశారని, చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించి, ఫిర్యాదులు చేయించారని తెలిపారు. వలంటీర్ల పేరుతో జన్మభూమి కమిటీలను తెచ్చి, వాటిలోని సభ్యులనే వలంటీర్లుగా తేవాలనేది చంద్రబాబు పథకమని, అదెప్పటికీ జరగదని అన్నారు. వలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబే అని చెప్పారు. పైపెచ్చు నేడు 33 మంది చనిపోయారంటూ ఎన్‌హెచ్చార్సీకే ఫిర్యాదు చేశారని, వారికి వీలుంటే ఐక్యరాజ్యసమితికైనా ఫిర్యాదు చేస్తారని ఎద్దేవా చేశారు.
వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారని బాబు అనడం అబద్ధమని స్పష్టం చేశారు. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని, వృద్ధులు చనిపోతే దానిని వైఎస్సార్‌సీపీకి అంటగట్టాలని చూస్తున్నారన్నారు. వలంటీర్లు గత నాలుగున్నరేళ్ళుగా పింఛన్లు, పథకాలను ప్రజలకు అందిస్తున్నారని, రెండు నెలలు అడ్డుకోవడం ద్వారా వారి ప్రభావాన్ని ఆపగలరనుకుంటే అవివేకమే అవుతుందని తెలిపారు. సీఎం జగన్ రోడ్ షోలకు లభిస్తున్న ఆదరణ చూసి భయపడి ఇలాంటివి చేస్తున్నారని అన్నారు.
మార్గదర్శి పేరుతో రామోజీ ఆర్థిక నేరాలు
మార్గదర్శిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని సజ్జల అన్నారు. మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. రామోజీ అక్రమాలు, మోసాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తాయన్నారు. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీరావు పూర్తిగా దిగజారిపోయారని, నిత్యం సీఎం జగన్‌పై విషం కక్కుతున్నారని అన్నారు. అందరికి నీతులు చెప్పే రామోజీరావు ఏనాడైనా నిష్పక్షపాతంగా వార్తలు రాశారా అని ప్రశ్నించారు.
మార్గదర్శి ఫైనాన్స్‌పై తీర్పు వస్తే ఆ వార్త ఈనాడులో ఎక్కడా లేదన్నారు. రామోజీ సృష్టించిన అబద్ధాలనే బ్యానర్ కథనాలుగా ఇస్తున్నారన్నారు. సాక్షాత్తు కోర్టులోనే ఏపీ ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగా ఉందని రామోజీరావు లాయర్ ద్వారా చెప్పారని అన్నారు. ఈనాడు స్క్రిప్టులనే చంద్రబాబు మాట్లాడతారని, వాటినే సోషల్ మీడియాలో నిజమనేలా దుష్ప్రచారం చేస్తారని చెప్పారు. చంద్రబాబును అర్జెంట్‌గా గద్దెనిక్కించాలనే తపన రామోజీలో కనపడుతోందన్నారు.
సీఎం జగన్ వ్యవస్థలను సక్రమంగా నడుపుతూ, చట్టాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తున్నారన్నారు. వాస్తవాలు బయటకు రావాలనే తాపత్రయం సీఎం జగన్‌లో ఉందని చెప్పారు. ఇదే క్రమంలో రామోజీరావు మార్గదర్శి అక్రమాలను, చంద్రబాబు స్కామ్‌లను బయటకు తెస్తున్నారని అన్నారు.
అభ్యర్థుల ఎంపికలో కూటమిలోనే గందరగోళం
వైఎస్సార్‌సీపీ టీం బ్రహ్మాండంగా ఉందని, తమ అభ్యర్థులను మార్చాల్సిన స్థితి లేదని సజ్జల స్పష్టం చేశారు. శాస్త్రీయ పద్ధతిలో, సుదీర్ఘ కసరత్తు తర్వాత అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. అభ్యర్థుల మార్పు జరుగుతుందనేది తప్పుడు ప్రచారమన్నారు. అభ్యర్థుల ఎంపికపై కూటమిలోనే గందరగోళం ఉందని, వారిలో వారికి పొత్తులు కుదరక నిత్యం అభ్యర్థులను మారుస్తూ.. వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నూటికి నూరు పాళ్లు విజయం వైఎస్సార్‌సీపీదేనని సజ్జల స్పష్టం చేశారు.
టీడీపీ వాళ్ళే హింసకు పాల్పతున్నారు
రాష్ట్రంలో టీడీపీ వాళ్ళే హింసకు పాల్పడుతూ ఆ బురద వైఎస్సార్‌సీపీపై వేస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా సజ్జల చెప్పారు. మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ వాళ్లపై దాడిచేసింది టీడీపీనేనని, ఒంగోలులో గొడవ చేసిందీ టీడీపీ వాళ్లేనని అన్నారు. సీఎం జగన్ ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల్లోకి వెళ్లి తాను చేసింది చెప్పి మధ్దతు కోరుతున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరికి ఏం చేయాలో తెలియక గంగవెర్రులెత్తుతున్నారని చెప్పారు. రాబోయే తీర్పుకు వారు ఇప్పట్నుంచే సాకులు వెతుక్కుంటున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment