సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రకటించడంలో ఆశ్చర్యమేముందని, చంద్రబాబు, పవన్ విడిపోతే కదా మళ్లీ కలవడానికి అంటూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉంటారని, వారిద్దరూ ఎప్పుడూ కలిసే ఉన్నారని తాము ఆది నుంచి చెబుతున్నామన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ జనసేనను స్థాపించారు.
బాబు సూచన మేరకు 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ–బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బాబును మళ్లీ సీఎంగా చేయడానికి టీడీపీ–బీజేపీ నుంచి వేరుపడ్డారు. బాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఐటీ శాఖ జరిపిన సోదాల్లో రూ. 2 వేల కోట్ల ముడుపుల బాగోతం బయటపడటంతో.. దాన్నుంచి తప్పించుకోవడానికి మళ్లీ బీజేపీతో పవన్ జట్టుకట్టేలా చంద్రబాబు చక్రం తిప్పారు.
ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి, చంద్రబాబును సీఎం చేయాలన్నది పవన్ ఆకాంక్ష’ అంటూ దెప్పిపొడిచారు. వైఎస్సార్‌సీపీ నేతలు యుద్ధం కావాలని కోరుకుంటే యుద్ధమే చేస్తామని పవన్ వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ.. పవన్ రాజకీయ నాయకుడే కాదని, ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సినిమాల్లో డైలాగులు బయట కూడా వేస్తే జనం నవ్వుతారని చెప్పారు.
సానుకూల ఓటుతోనే ఘనవిజయం సాధిస్తాం
సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు 75 శాతం ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీకీ ఇంత భారీ స్థాయిలో సానుకూల వాతావరణం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు కట్టకట్టుకుని వచి్చనా వైఎస్సార్‌సీపీని గెలిపించి.. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, సేవ చేయడం ద్వారా ప్రజల ఆశీస్సులు పొంది విజయం సాధించాలన్నదే వైఎస్సార్‌సీపీ విధానమని వివరించారు.
అడ్డంగా దొరికినా బాబు సుద్దపూసంటే ఎలా?
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో రూ.371 కోట్ల ప్రజల సొమ్ము దోచేశారనడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉండటం వల్లే చంద్రబాబును ఏసీబీ కోర్టు జైలుకు పంపిందని సజ్జల చెప్పారు. దొంగను కాదని చంద్రబాబు కోర్టులో నిరూపించుకోవాలని సూచించారు. స్కిల్ స్కాంలో సీఐడీ, ఈడీ అరెస్టు చేసి, బెయిల్‌పై ఉన్న డిజైన్ టెక్ ఎండీతో కుంభకోణమే జరగలేదని ఎల్లో మీడియా చెప్పించిందని, ఒక దొంగ మాటలను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంతో సంబంధమే లేదని, డిజైన్ టెక్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందమే కుదుర్చుకోలేదని, డిజైన్ టెక్‌కు ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లు తమకు చేరలేదని, ఈ కుంభకోణంలో విచారణకు సహకరిస్తామని సీమెన్స్ సంస్థ ప్రకటించిందని తెలిపారు. ఆ డబ్బంతా చంద్రబాబు జేబుల్లోకి పోయిందన్నారు. షెల్ కంపెనీల ద్వారా రూ.240 కోట్లు, మరో రూ.వంద కోట్లను సింగపూర్‌కు పంపి.. హవాలా మార్గంలో దోచేసినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఈడీలు తేల్చాయని చెప్పారు.
ఈ కుంభకోణానికి బాధ్యులైన నలుగురిని ఈడీ అరెస్టు చేసి రూ.32 కోట్ల ఆస్తులు జప్తు చేసిందన్నారు. అయినా చంద్రబాబు సుద్దపూస అని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చెబితే జనం నమ్ముతారనుకుంటే అది వారి అపోహేనని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో సిద్దహస్తుడినన్న నమ్మకంతోనే 2014–19 మధ్య చంద్రబాబు అడ్డగోలుగా కుంభకోణాలు చేసి, ప్రభుత్వ ఖజానాను దోచేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment