
సాక్షి, తాడేపల్లి: పవన్ మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉంటారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అదేమీ ఆయన దాచిపెట్టుకోకుండానే ఇంతకాలం రాజకీయాలు చేశారు. 2009లో చంద్రబాబు కోసం కలిసి పోటీ చేశారు. 2014లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటానికి విడిగా పోటీ చేశారు. ఇప్పుడు కలిశామంటున్నారు గానీ అసలు విడిపోయిందెప్పుడు?’’ అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ ఈ స్థాయిలో మద్దతు లేదు. ఫస్టు టైం 75 శాతం పైగా మద్దతు మాకు ఉంది. రకరకాల ఫ్యాక్టర్లు వచ్చే ఎన్నికల్లో పని చేసినా మాకు ఈసారి 60 శాతం ఓట్లు వస్తాయి. ఇది అహంకారంతో చెప్పటం లేదు. ప్రజలనుండి వస్తున్న మద్దతుతో ఎంతో నమ్మకంతో ఈ మాట చెప్తున్నాం.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్దంగానే వున్నాం. పవన్ చేసే మేకపోతు గాంభీర్యంలాంటి మాటలను మేము పట్టించుకోవాల్సిన పనిలేదు’’ అని సజ్జల స్పష్టం చేశారు.
‘‘స్కిల్ స్కాంలో రూ.350 కోట్లు బయటకు వెళ్లాయి. సీమెన్స్ కంపెనీ మాకు డబ్బు రాలేదని చెప్పింది. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీలకు వెళ్లినట్టు తేలింది. ఇక అవినీతి జరగలేదని అంటే ఎలా కుదురుతుంది?. గుడి, గుడిలోని లింగాన్ని కూడా దోచేసిన ముఠా చంద్రబాబు ముఠా. సీమెన్స్‌కు తెలియకుండానే డబ్బులు వెళ్లాయి. అసలు ఒప్పందంలో రూ.3,300 కోట్లు అనేదే లేదు. జీవోలో ఒకలాగ, ఒప్పందంలో ఒకలాగ రాసుకున్నారు. అమరావతి స్కాం, స్కిల్ స్కాం అన్ని బయటకు వస్తాయి. అడ్డంగా చేసిన తప్పులకు ఆధారాలు ఉన్నాయి’’ అని సజ్జల పేర్కొన్నారు.
‘‘వ్యవస్థలను మేనేజ్ చేయటంలో సిద్దహస్తుడినన్న నమ్మకంతోనే ఇలా అక్రమాలు చేశారు. ఎల్లవేళలా మేనేజ్ చేయటం కుదరదు. అడ్డంగా దొరికినా బాబు సుద్దపూస అంటే జనం నమ్మరు. వారు చేసే క్యాంపెయిన్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ ఒక పొలిటీషియన్ అయితే, ఆయనది ఒక పార్టీ అయితే బాధ్యతగా మాట్లాడేవాడు. సినిమాల్లో డైలాగులు వేసినట్లు బయట కూడా వేస్తే జనం నవ్వుతారు. రియాలిటీకి జనం దగ్గరగా ఉన్నారు. రీల్‌కి దగ్గరగా పవన్ ఉన్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్ అవ్వరా?
Comments
Please login to add a commentAdd a comment