Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu - Sakshi
Sakshi News home page

‘కుప్పంలో టీడీపీ అరాచకం.. చంద్రబాబే ప్రథమ ముద్దాయి’

Published Thu, Aug 25 2022 5:31 PM | Last Updated on Thu, Aug 25 2022 6:42 PM

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: కుప్పంలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విధ్వంసకర ఘటనకు టీడీపీ తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌  పాలనలో కుప్పం ప్రజలు అభివృద్ధిని చూశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కకావికలమైందన్నారు. ప్రజల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు. చంద్రబాబు సేవ చేస్తే ప్రజలు ఆయన గురించి ఆలోచిస్తారన్నారని సజ్జల అన్నారు.
చదవండి: చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని

‘‘కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ముందు నుంచే ఉన్న వైఎస్సార్‌సీపీ జెండాలను తొలగించారు. మా చంద్రబాబు వస్తుంటే వైసీపీ జెండాలు పెడతారా అంటూ దాడులకు దిగారు. టీడీపీ వాళ్లు కర్రలు తీసుకుని ఊరేగింపుగా వెళ్లారు. జరిగిన దాడులకు చంద్రబాబే ప్రథమ ముద్దాయి. నిన్న, ఇవాళ్ల అదే పనిగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా వ్యవహరించారు. గతంలో కూడా ఇలాగే చేశారు. నిన్నటి ఘటనకి శాంతియుతంగా వైఎస్సార్‌సీపీ నిరసన తెలిపితే వారిపైనా దాడులు చేశారు. డిప్రెషన్‌తో చంద్రబాబు బాధ పడుతున్నారని’’ సజ్జల వ్యాఖ్యానించారు.

‘‘జనాన్ని చంద్రబాబే స్వయంగా రెచ్చగొట్టారు. దాడులకు ఉసిగొల్పారు. 30 ఏళ్లుగా దొంగ ఓట్లతో గెలిస్తూ వచ్చారు. వాటన్నిటికీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ దెబ్బతో బ్రేక్  పడింది. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి ఆ నియోజకవర్గాన్ని వైఎస్సార్‌సీపీ బయటకు తెచ్చింది. స్థానిక ఎన్నికలలో మేము అన్నిటిలోనూ గెలిచాం. చంద్రబాబు వైఖరితో  విసుగు చెందిన కుప్పం ప్రజలు ఆయనకు చెల్లుచీటి చెప్పారు. టీడీపీ జెండాలు కట్టుకోవచ్చు. కానీ వైసీపీ జెండాలు పీకటం ఎందుకు?’’ అని సజ్జల ప్రశ్నించారు.

‘‘అన్నా క్యాంటీన్ పేరుతో రచ్చ చేశారు. గంటకుపైగా రోడ్డుపైన కూర్చున్నారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో వదిలేశారు. అందుకే కావాలని అక్కడకు వెళ్లి కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఎన్ని ఆరోపణలు చేసినా జనం నమ్మటం లేదు. అప్పట్లో వైఎస్సార్‌, 2019కి ముందు జగన్ పాదయాత్ర చేసి చంద్రబాబు చేసిన తప్పులు ప్రజలకి వివరిస్తే జనం నమ్మారు. అలాగే చేయాలని ఇప్పుడు చంద్రబాబు అనుకున్నాడు.‌ కానీ వాస్తవాలను చెప్తేనే నమ్ముతారన్న విషయాన్ని మాత్రం మర్చిపోయారు. ప్రజల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించడు. తన మీడియా ముందు ఏదో ఒకటి చెప్తే అదే జనం నమ్ముతారనుకోవటం అతని అవివేకం. పార్టీ ఆఫీసుని 30 ఏళ్ల తర్వాత  ఓపెన్ చేశాడంటే అతని పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చని’’ సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

‘‘60 లక్షలమంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని చంద్రబాబు చెప్తున్నారు. ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో అంత సీన్ లేదు. చంద్రబాబు, పవన్ మధ్య రహస్య బంధం ఎందుకు? . ఇద్దరూ కలిసే పని చేస్తున్నారని అందరికీ తెలుసు. వైఎస్సార్‌సీపీ విముక్త రాష్ట్రం కావాలని పవన్ అంటున్నారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ తొలగించాలని పవన్ కోరుకుంటున్నారు. జగన్ అంటేనే సంక్షేమం గుర్తొస్తుంది. ఆ సంక్షేమాన్ని ప్రజలకు అందకుండా చేయాలన్న లక్ష్యంతో పవన్, చంద్రబాబు పని చేస్తున్నారు. పేద ప్రజల కడుపు నింపాలనుకుంటే 2014లోనే అన్న క్యాంటీన్లు ఎందుకు పెట్టలేదు?. 2019 ఎన్నికలకు ముందే అవి ఎందుకు గుర్తొచ్చాయి’’ అంటూ సజ్జల నిలదీశారు.
చదవండి: చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం.. కీలక అరెస్టులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement