
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): బీజేపీ నాయకుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాసిన లేఖ చంద్రబాబు అందించిన స్క్రిప్టులా ఉందని పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవో 217 వల్ల నష్టమేంటో చంద్రబాబు, వీర్రాజు చెప్పాలని డిమాండ్ చేశారు. వీర్రాజు రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందన్నారు. రాజకీయ కుట్రతోనే మత్స్యకారులపై టీడీపీ, బీజేపీ కపట ప్రేమ చూపుతున్నాయని ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీ తెరచాటు బంధాన్ని ఇంకెంత కాలం కొనసాగిస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్టు డ్రామాలు ఆడొద్దని వీర్రాజుకు హితవు పలికారు. బాబు చెప్పినట్లు వింటే స్థాయి దిగజార్చుకున్న వారవుతారని సూచించారు.
బాబు పేరెత్తితే.. మత్స్యకారుల రక్తం మరిగిపోద్ది
మత్య్సకారులను చంద్రబాబు ఏ స్థాయిలో మోసం చేశారో అందరికీ తెలుసని మంత్రి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు పేరెత్తితే మత్య్సకారులందరి రక్తం మరిగిపోతుందన్నారు. ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేకపోవడానికి కారణాలేమిటని సూటిగా ప్రశ్నించారు. 217 జీవో వల్ల నష్టమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ జీవో నెల్లూరు జిల్లాకు మాత్రమే పరిమితమని, మిగతా జిల్లాల వారెవరూ ఈ జీవోపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఆ జిల్లాలోని 27 ట్యాంకులకు బహిరంగ వేలం నిర్వహించి తద్వారా వచ్చిన డబ్బును ఒక్కో మత్స్యకారుడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించే దిశగా ప్రయత్నం జరుగుతోందన్నారు. దీన్ని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, ట్యాంకులు అమ్మేస్తున్నట్టు అవాస్తవాలు ప్రచారం చేయడం తగదన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి అప్పలరాజు తెలిపారు. ప్రతి గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణంలో చేపలు అమ్మేందుకు మినీ రిటైల్ మార్కెట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా అమ్ముకునేలా మత్స్యకార మహిళలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో నాలుగింటికి మరికొద్ది రోజుల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. తీర ప్రాంతంలో మత్స్యకారులందరికీ ఇళ్లు ఇస్తామన్నారు.