ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిపోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్... దేశంలోని దాదాపు 90 శాతం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నపార్టీ... పదులసంఖ్యలో ముఖ్యమంత్రులు.. అదే సంఖ్యలో గవర్నర్లు.. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కాంగ్రెస్ నాయకుడు అనే ట్యాగ్ లైన్ ఏంటో ఘనంగా.. క్యాడర్ మెడలో కండువా గర్వంగా ఉండేది. కానీ ఆ వెన్నెలరోజులు ముగిశాయి.. ఇప్పుడు కాంగ్రెస్ సంపూర్ణంగా అమావాస్య రోజులను చూస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుంటుతూ నడుస్తోంది.. కొన్ని చోట్ల ఉనికి కూడాలేదు.
ఆంధ్రప్రదేశ్‌ను తమ రాజకీయ ప్రయోజనాలకోసం విడగొట్టిన కాంగ్రెసును సీమాంధ్ర ప్రజలు తమ క్రోధాగ్నిలో భస్మం చేసేసారు. సమీప భవిషత్తులో కోలుకునే అవకాశం లేకుండా చేసారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎగిరెగిరిపడిన నాయకులంతా 2019 ఎన్నికల్లో మట్టికరిచారు. నాయకుల మెడలోని కండువా దిగాలుగా నేలరాలింది. దీనికితోడు దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత అయన కుటుంబాన్ని, ముఖ్యంగా కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కశ వైఖరిని అంగీకరించని ప్రజలు ఆ పార్టీని నేలమట్టం చేసేశారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆంధ్రాలో ఎక్కడా పచ్చి మంచినీళ్లు కూడా పుట్టలేదు.
దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పేరు తలచుకోవడానికి సైతం కార్యకర్తలు ఇష్టపడడం లేదు. అయినా సరే 2014, 2019 ఎన్నికల్లో కొందరు నాయకులు కేంద్ర మంత్రులుగా చేసినవాళ్లు సైతం పట్టుమని పదివేల ఓట్లు సాధించలేక కుదేలైపోయారు. ఆశ్చర్యంగా మాకు ఈ నాయకుల్లో ఎవరూ వద్దు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు పెట్టిన నోటా కన్నా కూడా తక్కువ ఓట్లు తెచ్చుకుని కాంగ్రెస్ అవసాన దశలో ఉందన్న విషయాన్నీ ఎలుగెత్తి చాటుకుంది.
కేంద్ర మంత్రిగా పని చేసిన పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే 8,640 ఓట్లు వచ్చాయి. ఇంకో కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9585 ఓట్లు వచ్చాయి . ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1384 ఓట్లు వచ్చాయి.. ఇక్కడ నోటాకు 2340 ఓట్లు రావడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పొతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు కనీస మర్యాద దక్కలేదు.. ఇకముందూ దక్కదు. ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రాలో నూకలు దొరకవు అనేది ఇక్కడి స్కూలు పిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతాడు.. కాబట్టి దానిగురించి ఇంత చర్చ అవసరం లేదు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment