
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలో పేరుకుపోయిన అసంతృప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. గత కొన్నిరోజులుగా ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని, బీజేపీకి వెళ్తారని.. విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ మారే విషయంపై ఆయన నేరుగా స్పందించకుండానే రకరకాల స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు.
ఈ తరుణంలో.. కాంగ్రెస్ పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో వరుసగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన ఇంటికే క్యూ కడుతున్నారు. తాజాగా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రాజగోపాల్‌రెడ్డి భేటీ ముగిసింది. రాజగోపాల్‌రెడ్డి ఇంట్లో గంటపాటు ఈ ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడకుండా ఆపే బాధ్యతను ఉత్తమ్‌కు అప్పగించింది ఏఐసీసీ. అదే సమయంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి సైతం రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. వీళ్ల భేటీ తాలుకా సారాంశం మాత్రం బయటకు రాలేదు.
మునుగోడులో పర్యటన
ఇదిలా ఉండగా.. తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇవాళ(శనివారం) చౌటుప్పల్, సంస్థాన్ నారాయణ పురం, మునుగోడు మండలాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేస్తారన్న ప్రచారం తర్వాత తొలిసారిగా మునుగోడుకు వస్తున్న ఆయన.. మధ్యాహ్నాం మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలోనే ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన అనుచరులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment