‘బాబోయ్‌ వాంతులు’.. కూటమిలో చిచ్చు పెట్టిన మంత్రి కామెంట్లు! | Tanaji Sawant Said Vomiting After Coming Out About Ajit Pawar Led Ncp | Sakshi
Sakshi News home page

వీళ్ల పక్కన కూర్చుంటేనే వాంతులు.. కూటమిలో చిచ్చు పెట్టిన మంత్రి కామెంట్లు!

Published Fri, Aug 30 2024 5:37 PM | Last Updated on Fri, Aug 30 2024 7:13 PM

Tanaji Sawant Said Vomiting After Coming Out About Ajit Pawar Led Ncp

వీళ్ల పక్కన కూర్చోవాలంటేనే నాకు వాంతి వచ్చినట్లే అనిపిస్తుందంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందోనని అధికార మహాయుతి కూటమి నేతలకు భయం పట్టకుంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు?

సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన మంత్రి తానాజీ సావంత్ ఎన్‌సీపీ (అజిత్‌పవార్‌), కాంగ్రెస్‌ పట్ల తనకున్న అయిష్టత గురించి బహిర్గతం చేశారు. ‘‘నేను హార్డ్‌కోర్ శివసైనికుడిని. నా జీవితంలో కాంగ్రెస్, ఎన్‌సీపీతో నేను ఎప్పుడూ స్నేహం చేయలేదు. విద్యార్థి దశ నుంచి ఆ రెండు పార్టీలకు నేనెప్పుడూ దూరమే. కానీ రాజకీయ పరిణామాల తర్వాత ఎన్‌సీపీ నేతలతో కలిసి కేబినెట్‌ సమావేశంలో కూర్చోక తప్పడం లేదు. కూర్చున్నప్పటికీ బయటకు వచ్చిన తర్వాత నాకు వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది’’ అని మహరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్‌ వ్యాఖ్యానించారు.

ధర్మాన్ని కాపాడేందుకే మౌనం
మరోవైపు తానాజీ సావంత్‌ కామెంట్స్‌పై ఎన్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ అమోల్ మిత్కారీ ఓకింత అనుమానం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనమైన సంకీర్ణాన్ని కొనసాగించడం తమ పార్టీ బాధ్యత మాత్రమేనా? అని ప్రశ్నించారు. సంకీర్ణ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే తాము మౌనంగా ఉన్నామని అన్నారు.

బీజేపీకి అజిత్‌ పవార్‌ అవసరం తీరినట్లుంది
తానాజీ సావంత్‌ వ్యాఖ్యలపై ఎన్‌సీపీ(అజిత్‌ పవార్‌) వర్గం నేతలతో పాటు ఎన్‌సీపీ (శరద పవార్‌) వర్గం నేతలు సైతం స్పందిస్తున్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ..తానాజీ వ్యాఖ్యలు మహాయుతి సంకీర్ణానికి ఇకపై అజిత్ పవార్ ఎన్‌సీపీ అవసరం లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లైంది. ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా అజిత్ పవార్‌తో పొత్తుపై ఆందోళనలు తలెత్తాయని, ఇప్పుడు సావంత్ ప్రకటనతో ఆందోళనలు బహిర్గతం అయ్యాయని సూచించారు. బీజేపీ అజిత్ పవార్‌ను మహాయుతి నుండి బయటకు పంపే సమయం ఆసన్నమైంది. పరిస్థితులు బాగలేవని చెప్పారు.  

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి
అజిత్ పవార్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోయారని, ఎన్‌సీపీతో పొత్తుపై ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని  శివసేన నేతల్లో అసంతృప్తి పెరుగుతోందని మరో ఎన్‌సీపీ (ఎస్‌పి) ప్రతినిధి మహేష్ తపసే పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్‌సిపిలో అపారమైన గౌరవాన్ని పొందిన అజిత్ పవార్‌ అధికారం కోసం తన ఆత్మగౌరవాన్ని రాజీ చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదన్నారు. మరి ఈ వరుస పరిణామాలపై మహాయుతి కూటిమి పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

తానాజీ సావంత్ వ్యాఖ్యలతో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమి నేతల్లో గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement