
ప్రజల నుంచి మంచి స్పందన ఉంది
3న జరగాల్సిన సిద్ధం సభ 10కి మార్పు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
మేదరమెట్ల: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పి.గుడిపాడు వద్ద వచ్చే నెలలో నిర్వహించే సిద్ధం సభ కోసం ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని ఆయన పార్టీ నేతలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మార్చి 3న జరగాల్సిన సిద్ధం సభను 10వ తేదీకి మార్చామన్నారు. సిద్ధం సభలు ఎక్కడ జరిగినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.
ఈసారి సభకు 15 లక్షల మంది హాజరయ్యేలా వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. మరో వంద ఎకరాలు కూడా సభాప్రాంగణానికి ఆనుకుని అందుబాటులో ఉన్నాయన్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన ప్రజలు ఈ సభకు హాజరవుతారని వెల్లడించారు. మార్చి 10న సిద్ధం సభకు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన చేస్తోందని కొనియాడారు.
ప్రజల స్పందన చూస్తుంటే రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందడం ఖాయమని తెలుస్తోందన్నారు. మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందని.. అతి త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రకటించకుండా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తారని చెప్పారు. ఎంతమంది పొత్తులతో వచ్చి నా ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగు నాగార్జున, ఎంపీలు నందిగం సురే‹Ù, మోపిదేవి వెంకట రమణారావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు పానెం చిన హనిమిరెడ్డి, కరణం వెంకటేశ్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.