సాక్షి ప్రతినిధి, కడప: కడప పార్లమెంట్ బలిపీఠం ఎక్కించేందుకు టీడీపీ నానా హైరానా పడింది. అభ్యర్థి ఎంపికకు పలు రకాలుగా కసరత్తు చేసింది. క్రమం తప్పకుండా ఐవీఆర్‌ఎస్ ఫోన్ సర్వేలు నిర్వహిస్తూ రోజుకొక పేరు తెరపైకి తెచ్చింది.ఎట్టకేలకు జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ టికెట్ ఆశించిన భూపేష్‌ను ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుయుక్తుల మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే, ఓటమి ఎదుర్కోవాల్సిన సీటుకు భూపేష్‌ను ఎంపిక చేయడం వెనుక ఆదినారాయణరెడ్డి తెరవెనుక వ్యూహం పన్నినట్లు సమాచారం.
►మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన తర్వాత చివరలో ఆ ఫలితం తన ఖాతాలో వేసుకోవడం ఆదికి అలవాటుగా మారిపోయింది. ఈమారు టీడీపీ అధినేత చంద్రబాబుపై నారాయణరెడ్డి కుటుంబం పెట్టుకున్న ఆశలు సైతం నీరుగారిపోయాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని అటు తండ్రి చంద్రబాబు, ఇటు తనయుడు లోకేష్ భూపేష్‌రెడ్డిని ఊరించారు. తుదకు జమ్మలమడుగు సీటు బీజేపీకి కేటాయించి రాజకీయ సంకటస్థితిలోకి నెట్టారు. హితులు, సన్నిహితుల సూచనల మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు భూపేష్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా పసిగట్టిన ఆది అండ్‌కో పార్లమెంట్ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే దిశగా...
టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన తమకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావించిన భూపేష్‌రెడ్డి ఇప్పుడు జమ్మలమడుగు టికెట్‌ను బీజేపీకి కేటాయించడం పట్ల డైలమాలో పడ్డారు. ఆదినారాయణరెడ్డి బీజేపీ కార్యాలయం జమ్మలమడుగులో ప్రారంభించి, టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగా టీడీపీ టికెట్ భూపేష్‌కు దక్కకుండా పథక రచన చేసి సక్సెస్ అయ్యారు. ఈదశలో అటు కుటుంబ సభ్యులు ఇటు భూపేష్ మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలనే ఒత్తిడి తెచ్చారు. ఆమేరకు భూపేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నహాలు చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితు ల్లో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్‌ను ప్రకటించేలా ఆది తెరవెనుక మంత్రాంగం చేపట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆమేరకు టీడీపీ అధిష్టానం భూపేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం విశేషం.
జమ్మలమడుగులో అడుగుపెట్టని ఆది...
బీజేపీ అభ్యర్థిగా నాలుగు రోజుల క్రితం ఆదినారాయణరెడ్డిని ప్రకటించినా ఇప్పటికీ జమ్మలమడుగులో అడుగుపెట్టలేదు. అందుకు కారణం దేవగుడి కుటుంబం నుంచి తీవ్ర ప్రతిఘటన ఉండటమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టీడీపీ టికెట్ భూపేష్‌కు దక్కదని, బీజేపీ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని చెప్పి, ఆమేరకు సక్సెస్ అయినా ఆది కుయుక్తులను దేవగుడి కుటుంబం పసిగట్టింది. నారాయణరెడ్డి కుటుంబానికి అప్పుడు, ఇప్పుడు ఆదినారాయణరెడ్డి రాజకీయ వెన్నుపోటు పొడిచారని గ్రహించి కుటుంబం అంతా భూపేష్‌కు అండగా నిలిచింది. ఈపరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిగా ఎంపికై నా స్వగ్రామంలో కాలు పెట్టలేని దుస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఏది ఏమైనా కడప పార్లమెంటు బలిపీఠంపై భూపేష్‌ను బలవంతంగా ఎక్కించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
భూపేష్‌ది అదే పరిస్థితి..
ఆదినారాయణరెడ్డి తమ రాజకీయ వారసుడు భూపేష్‌రెడ్డి అంటూ 2009 ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. 2014లో భూపేష్ తెరపైకి వస్తారని భావించినా, ఆదినారాయణరెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. నారాయణరెడ్డి కుటుంబానికి రాజకీయ వెన్నుపోటు పొడిచినట్లే, తర్వాత వైఎస్సార్‌సీపీ కూడా వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆపై మంత్రి పదవి సైతం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అప్పటినుంచి స్థానికంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారు. టీడీపీ అధికారం కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో బీజేపీ కండువా వేసుకున్నారు.
వర్గ రాజకీయాలకు నిలయమైన జమ్మలమడుగులో క్యాడర్‌ను కాపాడుకోవాలని నారాయణరెడ్డి తన కుమారుడు భూపేష్‌రెడ్డితో కలిసి టీడీపీలో యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు నారాయణరెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. భూపేష్ రాజకీయ ఎదుగుదలకు దేవగుడి కుటుంబం (ఆదినారాయణరెడ్డి మినహా) పని చేస్తూ వచ్చింది. ప్రస్తుతం టీడీపీ టికెట్ లభిస్తుందని భావించారు. అనూహ్యంగా ఆ స్థానంలోకి ఆదినారాయణరెడ్డి వచ్చి చేరిపోయారు. ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించేలా మంత్రాంగం నిర్వహించారు. తాము కష్టపడి క్యాడర్‌ను తయారు చేసుకుంటే చివర్లో వచ్చి కోడిపిల్లను గద్ద ఎత్తుకెళ్లినట్లు ఎమ్మెల్యే సీటును ఆదినారాయణరెడ్డి దక్కించుకున్నారనే ఆవేదన భూపేష్‌లో ఉండిపోయింది. నాడు తండ్రి సీటును బ్లాక్‌మెయిల్ రాజకీయాల ద్వారా చేజేక్కించుకున్న ఆది, రాజకీయ మంత్రాంగంతో నేడు తనయుడి సీటును దక్కించుకుని ‘ఆది’పోటుకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment