సాక్షి, అనకాపల్లి: అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ వంగలపూడి అనిత. పాయకరావుపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ లేనంతగా భారీ అవినీతి, భూఆక్రమణలకు పాల్పడ్డారు. వెబ్‌ల్యాండ్‌లో మార్పులతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న (2014–19) ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె చేసిన అక్రమాలు అన్ని ఇన్నీ కావు. వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం చేయడమే కాదు.. కోట్ల విలువైన అభివృద్ధి పనులను నామినేషన్ పద్ధతిలో పంచేసుకుని సొమ్ముచేసుకున్నారు. ఇసుకను దోచేశారు. మట్టిని కాజేశారు. మరుగుదొడ్లలో మెక్కేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి దోచుకున్నారు.
నీరు–చెట్టు పథకంలో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేశారు. చెరువు తవ్వకాల్లో వచి్చన మట్టిని రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించడం, తాండవ, వరాహ నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వి కంపెనీలకు విక్రయించడం, భూరికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు పుట్టించి పాసు పుస్తకాల్లో నమోదు చేయించుకోవడం, ఈ భూములకు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు పరిహారం పొందేందుకు స్కెచ్ వేయడం ఇలా అక్రమాల చిట్టా చాలానే ఉంది. జన్మభూమి కమిటీలతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను అర్హులైన వారికి కేటాయించకుండా లక్షలాది రూపాయలకు అమ్మేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. రేషన్ డిపోలు, అంగన్‌వాడీ ఆయా, కార్యకర్తల పోస్టులు కూడా ఇలాగే అమ్మేసుకున్నారు. మరుగుదొడ్లు, పక్కా గృహాలు, పింఛన్ల మంజూరు వంటి పథకాల అమలులో కూడా లబి్ధదారులనుంచి వేలాది రూపాయలు గుంజేశారు.
మట్టి విక్రయాల్లో రూ.25 కోట్లు
అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నీరుచెట్లు పథకం కింద పాయకరావుపేట నియోజకవర్గంలో నాలుగేళ్లలో సుమారు రూ.12 కోట్ల విలువైన పనులు జరిగాయి. వీటిలో రూ.6 కోట్లు వరకూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అనిత బొక్కేశారు. ఎస్.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల్లో ఇలా నిధులు కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి. కోటవురట్లలో ఊరచెరువు, జల్లూరులో నాగన్న చెరువు, ఎస్.రాయవరం మండలం రామయ్యపట్నంలో జగ్గరాజు చెరువు, పెదగుమ్ములూరులో రాతి చెరువు, పెద ఉప్పలం చెరువు అప్పలరాజు చెరువులలో పనులు జరగకపోయినా జరిగినట్లు చూపించి మోసం చేశారు. మట్టి విక్రయాల ద్వారా మరో రూ.25 కోట్లు వెనకేసుకున్నారు.
రూ.50 కోట్ల ఇసుక తరలింపు
స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు చూసుకుని టీడీపీ నాయకులు ఇసుక నుంచి కోట్లు పిండేశారు. తాండవ, వరాహ నదుల్లో దార్లపూడి, పందూరు, గొట్టివాడ, గుమ్ములూరు, పెదఉప్పలం, పెనుగొల్లు, ధర్మవరం, సోముదేవుపల్లి సత్యవరం, పెంటకోట, మాసయ్యపేట, అరట్లకోట తదితర ప్రాంతాల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తవ్వేశారు. సుమారు రూ.50 కోట్లు విలువైన ఇసుకను కొల్లగొట్టడం ద్వారా నాలుగు మండలాల ముఖ్య నాయకులు సుమారు రూ.20 కోట్ల మేర లాభాలు ఆర్జించారు.
మరుగుదొడ్లలో 15 కోట్లు..
టీడీపీ ప్రభుత్వంలో పాయకరావుపేట నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు నిరి్మంచారు. ఆరి్థక సంఘం నిధులు దాదాపుగా సుమారు రూ.300 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులన్నీ టీడీపీకి చెందిన సర్పంచ్‌లు, ముఖ్య నాయకులే చేపట్టారు. నాణ్యతా లోపంతో పనులు చేసి రూ.50 కోట్ల వరకు స్వాహా చేశారు. అలాగే నియోజకవర్గానికి 25 వేల మరుగుదొడ్లు మంజూరైతే..వాటికి రూ.37 కోట్లు విడుదల చేశారు. ఒక్కో దానికి రూ.15 వేలు కేటాయించారు. వీటిని నిరి్మంచే బాధ్యత తెలుగుతమ్ముళ్లే తీసుకున్నారు. వీటిలో సగం మరుగుదొడ్లు బినామీలకే మంజూరు చేశారు. ఇలా మరుగుదొడ్లలో రూ.15 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు తెలిసింది.
600 ఎకరాల్లో భూ కుంభకోణాలు
అప్పట్లో అనిత నేతృత్వంలో నియోజకవర్గంలో సుమారు 600 ఎకరాల్లో భూకుంభకోణాలకు పాల్పడ్డారు. వెబ్‌ల్యాండ్‌లో మార్పుల పేరిట.. భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. సబ్‌డివిజన్–2లో సుమారు రూ.10 కోట్ల విలువైన 4.40 ఎకరాల ప్రభుత్వ భూమిని జిరాయితీగా పేర్కొంటూ మరో ముగ్గురి పేరున ఒన్ బీ, ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ల్యాండ్ సీలింగ్ పేరిట టీడీపీ నాయకులు భారీగా ఆక్రమణలకు పాల్పడ్డారు. అమలాపురంలో 105 ఎకరాల భూముల్లో రూ.22 కోట్లు, రాజయ్యపేటలో 19 ఎకరాల్లో రూ.5 కోట్లు, నెల్లిపూడిలో 42 ఎకరాల్లో రూ.15 కోట్లు, గుర్రాజుపేటలో 10 ఎకరాల్లో రూ.3 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment