
సాక్షి, ఢిల్లీ: ఎట్టకేలకు చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరు ముగ్గురు దాదాపు గంటపాటు పొత్తులపై చర్చలు జరిపినట్టు సమాచారం. కానీ, చివరకు ఎలాంటి ప్రకటనా వెల్లడించకపోవడం గమనార్హం.
కాగా, అమిత్‌షాతో చంద్రబాబు, పవన్ భేటీ ముగిసిన అనంతరం ఎలాంటి సంయుక్త పొత్తు ప్రకటన వెలువడలేదు. వీరి భేటీపై ప్రకటన చేయకుండా ఎవరికి వారే విడివిడిగా వెళ్లిపోయారు. అయితే, వీరి భేటీ గురించి మాత్రం టీడీపీ కొన్ని లీకులు ఇస్తోంది. మూడు పార్టీల పొత్తులో భాగంగా జనసేన-బీజేపీకి కలిపి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్టు టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జనసేనకు కేటాయించిన సీట్లలోనే చంద్రబాబు కోత పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక, టీడీపీ మాత్రం 17 లోక్‌సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. ఇదే సమయంలో అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట సీట్లు బీజేపీకి ఇచ్చామని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. కాగా, పొత్తులపై వీరు ఎప్పుడు స్పందిస్తారో వేచిచూడాలి.
త్యాగానికి జనసేన రెడీ..
కూటమి పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ మరో త్యాగానికి సిద్ధమైనట్టు సమాచారం. జనసేనకు ఇచ్చిన మూడు పార్లమెంట్ స్థానాల్లో ఒక్క స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన కేవలం అనకాపల్లి, మచిలీపట్నం నుంచి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక, ఈ రెండు స్థానాల్లో కాకినాడలో పవన్ కల్యాణ్, మచిలీపట్నం నుంచి బాలశౌరీ పోటీ నిలిచే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ పెద్దల సూచనల మేరకు పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రఘురామకు చేదు అనుభవం..
ఇదిలా ఉండగా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చేదు అనుభం ఎదురైంది. చంద్రబాబు, పవన్ తమ వెంట రఘురామను అమిత్ షా వద్దకు తీసుకువెళ్లలేదు. దీంతో, సిబ్బంది కూడా ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనను లోపలికి అనుమతించాలని కాల్స్ మీద కాల్స్ చేశారు. అయినా కూడా రఘురామను లోపలికి అనుమతించలేదు. ఇక చేసేదేమీ లేక వారు బయటకు వచ్చేంత వరకు రఘురామ గేటు బయలే నిలబడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment