కొనసాగుతున్న కోడ్ ఉల్లంఘనలు
దుత్తలూరులో అనుమతి లేకుండా సమావేశం.. అడ్డుకోబోయిన ఎంపీడీవోపై దౌర్జన్యం
ఉదయగిరి/గుడివాడ టౌన్/కడప సెవెన్‌రోడ్స్ /ఎర్రగుంట్ల/ జంగారెడ్డిగూడెం: టీడీపీ నేతల ఎన్నికల కోడ్ ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉన్నా అనుమతులు లేకుండానే సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెళ్లి అభ్యంతరం తెలిపితే దాడులకు సైతం తెగపడుతున్నారు.
ఎంపీడీవోపై దౌర్జన్యం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంకు ఆవరణలో బుధవారం సాయంత్రం ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ అనుమతులు లేకుండా అనుచరులతో సమావేశం నిర్వహించారు. దుత్తలూరు ఎంపీడీవో కె.సురేష్‌బాబు సమావేశ ప్రాంతానికి వెళ్లి అనుమతులు తీసుకోనందున సమావేశం ఆపివేయాలని నేతలకు తెలిపారు. కానీ వారు పట్టించుకోకుండా సమావేశం కొనసాగించడంతో ఆ దృశ్యాలను తన సెల్‌లో ఎంపీడీవో చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో అక్కడున్న టీడీపీ నేతలు, కొంతమంది కార్యకర్తలు ఎంపీడీవోపై దౌర్జన్యం చేస్తూ నానా దుర్భాషలాడుతూ సెల్‌ఫొన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఎంపీడీవో ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అక్కడున్న కార్యకర్తలు కారును చుట్టుముట్టి ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా కొందరు కార్యకర్తలకు సర్దిచెప్పి కారును అక్కడి నుంచి పంపించారు.
ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేయగా టీడీపీకి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చేజర్ల మల్లికార్జునపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా రెండ్రోజుల క్రితం వింజమూరులోని కాకర్ల క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడానికి ప్రయత్నించిన అధికారులను కూడా అడ్డుకున్నారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు అధికారులు ఆ ఫ్లెక్సీలు తొలగించారు.
కడప టీడీపీ అభ్యర్థి అభ్యంతరకర పోస్టు
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కడప నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవికి గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కడప రెవెన్యూ డివిజన్ అధికారి, రిటర్నింగ్ అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. ఆమె బుధవారం ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టును విడుదల చేయడంపై షోకాజ్ నోటీసును జారీ చేశామన్నారు.
అనుమతులు లేకుండా టీడీపీ కార్యాలయం
అనధికారికంగా ఓ భవనంలో టీడీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుతో జంగారెడ్డిగూడెం ఎంపీడీవో, ఎంసీసీ నోడల్ అధికారి కేవీప్రసాద్ మున్సిపల్ కమిషనర్, ఎంసీసీ నోడల్ అధికారి నరేంద్రకుమార్, పోలీస్ సిబ్బంది, ప్లయింగ్ స్క్వాడ్ బృందం అధికారి కేవీ రమణ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అధికారులు అక్కడికి వచ్చేలోపే పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను టీడీపీ నేతలు తొలగించారు.
అక్కడికి చేరుకున్న అధికారులకు ఇది పార్టీ కార్యాలయం కాదని.. ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇల్లు అని, తమ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు చేయడం లేదని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అనుమతులు లేకుండా ఎటువంటి పార్టీ కార్యకలాపాలు ఆ భవనంలో చేయకూడదని హెచ్చరించి అధికారులు వెనుతిరిగారు. కాగా, ఈనెల 16న దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన రోజే సాయంత్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి అట్టహాసంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
స్థానికులను కార్యాలయానికి రప్పించి ప్రలోబాలకు గురి చేస్తున్నారు. టీడీపీ నాయకుల వీరంగంగుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను గురువారం తొలగించే ప్రయత్నం చేసిన మున్సిపల్ సిబ్బందిపై టీడీపీ నాయకులు వీరంగం చేశారు. తాము అనుమతుల కోసం దరఖాస్తు చేశామని అవి వచ్చేవరకు తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
టీడీపీ కార్యాలయంలో బ్యానర్లు
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం యర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో గురువారం నాటికి కూడా టీడీపీ కార్యాలయంలో బ్యానర్లపై పేర్లు తొలగించలేదు. అధికార పక్షానికి చెందిన పోస్టర్లు, బ్యానర్లు తొలగించిన అధికారులు టీడీపీ పోస్టర్ల జోలికి వెళ్లకపోవడం విశేషం.
టీడీపీ నేత వాహనం
సీజ్ ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా కారులో సామగ్రి
కడప అర్బన్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తిరుగుతున్న టీడీపీ నేత వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి భూపేష్ వాహనాన్ని రెవెన్యూ, పోలీసు బృందం గురువారం సీజ్ చేసింది. ఎన్నికల కోడ్ అమలు చేసే క్రమంలో కడప డిప్యూటీ తహసీల్దార్ రోనాల్డ్ శామ్యూల్ ఆధ్వర్యంలో డబ్ల్యూఆర్‌డీ ఏఈ రమణ, హెడ్‌కానిస్టేబుల్ జె.సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్ ఎం.వి శేషారెడ్డి వాహనాలను ఆపి సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో స్కార్పియో వాహనం (ఏపీ39 క్యూఎఫ్ 3838) కోడ్‌కు విరుద్ధంగా ఉండటాన్ని గుర్తించారు. కారు వెనుక అద్దం మొత్తం ‘మన భూపేష్ అన్న మన జమ్మలమడుగు’ అని ఫొటో అతికించడంతో పాటు వాహనంలో పార్టీ కండువాలు, ప్లాస్టిక్ జెండా పైపులు, క్యాలెండర్లు, కరపత్రాలు ఉన్నాయి. దీంతో ఆ సామగ్రితో పాటు వాహనాన్ని అధికారుల బృందం స్వా«దీనం చేసుకుంది. దీనిపై కడప వన్‌టౌన్ సీఐ సి.భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వాహన డ్రైవర్ పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment