ప్రజల విశ్వాసం పొందిన రాజకీయ నాయకులు జీవితాంతం ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తుంటారు. కొందరు నాయకులు అయితే ప్రతి ఎన్నికకు నియోజకర్గాన్ని మారుస్తుంటారు. గెలిచిన చోట ప్రజలకు ఏమీచేయని వారు భయపడి మరో నియోజకవర్గం వెతుక్కుంటారు. టీడీపీలో ఓ నేత ఉన్నాడు. దక్షిణ కోస్తా నుంచి విశాఖకు వలస వచ్చి ఇక్కడ తిష్ట వేశాడు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం, అధికారం కోసం పార్టీల మార్పిడి ఆయన నైజం.
ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలసవచ్చిన గంటా శ్రీనివాసరావు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరికి పోర్టు కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తి వేల కోట్లకు పడగలెత్తారు. బాగా సంపాదించాక రాజకీయాలపై ఆసక్తి పెరిగి తెలుగుదేశంలో చేరి 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోని గంటా 2004లో అనకాపల్లి ఎంపీ సీటు వదిలేసి 2004లో చోడవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
2009లో టీడీపీని వదిలేసి..ప్రజారాజ్యంలో చేరి ఈసారి అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పదవి అనుభవించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అదృశ్యం కావడంతో మళ్ళీ టీడీపీ గూటికి చేరి ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు.
చదవండి: ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు?
రాజకీయాల్లోకి వచ్చాక జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు చోట్ల నుంచి గంటా పోటీ చేశారు. ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం గంటా శ్రీనివాసరావు స్పెషల్ అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. 2014లో భీమిలి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి కూడా అనుభవించిన గంటా శ్రీనివాసరావు అసలా నియోజకవర్గానికి ఎమ్మెల్యేను అన్న విషయమే మర్చిపోయారు. దీంతో భీమిలి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక భీమిలిలో మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదని అర్థం చేసుకున్న గంటా 2019లో విశాఖ సిటీలోని నార్త్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు.
2019లో భీమిలిని వదిలేసి విశాఖ నార్త్‌లో పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న గంటా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించారు. అయినా సరే అత్తెసరు మెజార్టీతో విజయం సాధించారు. తనకున్న ఏరుదాటాక తెప్ప తగలేసే అలవాటు ప్రకారం విశాఖ నార్త్ నియోజకవర్గంను మర్చిపోయారు. ఐదేళ్ళ కాలంలో తనను గెలిపించిన ప్రజలకు కనీసం మొహం కూడా చూపించలేదు. కోవిడ్ మహమ్మారి విజృంభించినపుడు కూడా ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
గంటా శ్రీనివాసరావు కనిపిస్తే విశాఖ నార్త్ నియోజకవర్గంలో మొహం మీద ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో గంటా ఈసారి మళ్లీ కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కున్నారు. పదేళ్ళ క్రితం తనను గెలిపించిన భీమిలి నియోజకవర్గంపై మళ్ళీ కన్నేశారు. అక్కడి ప్రజలకు తనపై కోపం పోయింటుందని భావించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు వందల కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి భీమిలి సీటు సంపాదించుకున్నారు.
సీటు కొనుక్కోవడానికి ఎంతైనా పార్టీ ఫండ్ ఇవ్వడం.. గెలవడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడం అలవాటైన గంటా శ్రీనివాసరావు భీమిలి ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారు. అధికారం అడ్డం పెట్టుకొని బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటా శ్రీనివాసరావుది. తీసుకున్న అప్పు.. వడ్డీతో కలిపి 400 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో గంటా తనకా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు ఇటీవల ఇండియన్ బ్యాంక్ నోటీసులు కూడా జారీ చేసింది.
మరోవైపు గంటాకు సీటు ఇవ్వడంపై భీమిలిలోని జనసేన, టిడిపిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మొదట ఈ సీటు జనసేనకే అని ప్రకటించారు. దీంతో అక్కడి జనసేన నేతలు సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు గంటా చంద్రబాబు, పవన్‌లను డబ్బుతో కొట్టి సీటు తన్నుకుపోవడంతో భీమిలి నేతలు బహిరంగంగానే తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. జనసేన సీటు వచ్చిందని భావించి భంగపడ్డ పంచకర్ల సందీప్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఔ
పవన్ తీరుతో జనసేన కార్యకర్తలమని చెప్పుకునేందుకే సిగ్గేస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పుడు భీమిలిలో గంటాకు..అటు టీడీపీ నుంచి..ఇటు జనసేన నుంచి సహాయ నిరాకరణ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గంటాకు సీటు విషయంలో పునరాలోచన చేయకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అక్కడి టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment