సాక్షి, కరీంనగర్: పోలీసులు తెలంగాణాలో సీఎం కేసీఆర్ ఎలా చెబితే అలా ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌లదీ అదే దుస్థితి అని మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక పార్లమెంట్ సభ్యుడిని ఎలాంటి నోటీస్, వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. అయినా న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
తెలంగాణా యువత కోసం పోరాటం చేసినందుకు సంజయ్‌ను అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనాగరిక, ఆటవిక పాలన కొనసాగుతోందని, ఒక లోక్ సభ సభ్యుడికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని సూటిగా ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఓ ఆతంకవాది తరహాలో ఓ పార్లమెంటేరియన్‌ను అరెస్ట్ చేసిన విధానం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పేపర్ లీక్ మాఫియా నడుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో కేసీఆర్ పాలనపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఆలీబాబా నలభై దొంగల్లాంటి మంత్రి మండలిని పెట్టుకుని నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పేపర్ లీకేజీ మాఫియా వెనుక ఎవరున్నారో కేసీఆర్ చెప్పాలని, ఆ కింగ్ పిన్ ఎవరో బయటపెట్టాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment