కాంగ్రెస్ నేతలు పాదయాత్రలంటే హడలిపోతున్నారెందుకు? ఒక వైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మరోవైపు సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలు షురూ చేశారు. వీరిద్దరి యాత్రలతో జిల్లాల నాయకులు ఇబ్బంది పడుతున్నారు. మా నియోజకవర్గంలో పాదయాత్ర వద్దంటే ఏమవుతుందో అన్న భయం. అగ్ర నేతల ఆధిపత్య పోరుతో నలిగిపోతున్న జిల్లా నాయకులు. అసలు టీ.కాంగ్రెస్‌లో ఏంజరుగుతోంది?
చేయి తుప్పు వదులుతోందట.!
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రల పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ యాత్రలు చేస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. అయితే ఎవరి నియోజకవర్గంలో వారు పాదయాత్ర చేస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర అంటూ బయల్దేరడంతో నియోజకవర్గ స్థాయి నేతల గుండెలు అదిరిపోతున్నాయట.
పాదయాత్ర అంటేనే ఖర్చుతో కూడుకున్నది. జనసమీకరణ, భోజనాలు, ఇతర ఏర్పాట్లు అన్ని కలిపి ఒక్క రోజుకు కనీసం 25 నుంచి 30 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఒక నియోజకవర్గంలో ఒక్కరోజు పాదయాత్ర అయితే ఇబ్బంది లేదు కానీ నేతలు పోటీ పడి యాత్ర చేయడం ద్వారా తమకు ఖర్చు తడిసి మోపడవుతోందని తెగ హైరానా పడిపోతున్నారట నియోజకవర్గాల్లో టిక్కెట్ ఆశిస్తున్న నాయకులు.
పాదయాత్రకు టికెట్‌కు లింకు
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున తమ నియోజకవర్గంలో పాదయాత్ర వద్దంటే టిక్కెట్ ఎక్కడ ఎగిరిపోతుందో అనే భయం ఒకవైపు... యాత్ర లేకపోతే కేడర్‌లో ఉత్సాహం తగ్గిపోతుందనే ఆందోళన మరోవైపు స్థానిక నేతల్ని ఆలోచనలో పడేస్తోంది. ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అటు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా భట్టి విక్రమార్క తన పాదయాత్ర షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించారు.
మరోవైపు 150 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పుడు సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఒక్కో నియోజకవర్గంలో ఒకటి, రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు రాష్ట్ర నాయకులు పాదయాత్ర పెట్టుకోవడం నియోజకవర్గ నేతలకు ఆర్థిక భారంగా మారిందట.
అలా జిల్లాలు చుట్టేస్తున్నారు.!
హుజురాబాద్, హుస్నాబాద్, స్టేషన్ ఘన్ పూర్, వర్దన్న పేట, ఇల్లందు, కొత్తగూడెం ఇలా పలు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర పూర్తయింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ప్రారంబించిన భట్టి పాదయాత్ర కూడా ఈ నియోజకవర్గాల గుండా వెళ్ళనుంది. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ పరధిలోనే పాదయాత్ర షెడ్యూల్ ను రేవంత్ రెడ్డి ఇంకా ప్రకటించలేదు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పూర్తయ్యాక రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తారని చెబుతున్నారు.
అయినను పోయి రావలెను
భట్టి పాదయాత్ర చేసిన రూట్ లో రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ పాదయాత్ర చేసిన రూట్ లో సీఏల్పీ నేత పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగం ఏంటనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇద్దరు నేతలు కూర్చుని కర్ణాటక కాంగ్రెస్ నేతల మాదిరిగా.. ఒకరు పాదయాత్ర చేసిన నియోజకవర్గంలో మరోకరు చేయకుండా రూట్ మ్యాప్ తయారు చేసుకుంటే పార్టీకి ప్రయోజనం ఉంటుంది...నియోజకవర్గ నేతలకు ఆర్థిక భారం తగ్గతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాని క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా..గాంధీభవన్ నేతలు ఏకపక్షంగా పాదయాత్ర రూట్ మ్యాప్ లను ప్రకటించడంతో నియోజకవర్గ ఇంచార్జ్ లు, ఆశావాహులు నలిగిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment