
పాతర్‌చేడ్‌లో మాట్లాడుతున్న షర్మిల
మక్తల్/నర్వ: రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకుని, సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. శనివారం మక్తల్ మండలం మంతన్‌గోడ్‌లో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ హయాంలోనే 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ప్రజల సమస్యలపై ఆయన ఏమాత్రం స్పందించడంలేదని మండిపడ్డారు.
పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి పనికొచ్చేలా మారిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని, తాము అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగ కల్పనపైనే చేస్తానన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అకౌంట్‌లో రూ.860 కోట్లు ఉన్నాయని చెబుతుంటూనే అర్థమవుతోందని షర్మిల పేర్కొన్నారు.
కాగా, నర్వ మండలం పాతర్‌చేడ్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. మక్తల్ మండలంలో యాత్ర ముగించుకుని నర్వ మండలంలోకి ప్రవేశించగా పాతర్‌చేడ్‌లో పాదయాత్రకు అడుగడుగునా స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నర్వ మండలం పాతర్‌చేడ్ వరకు 1,700 కి.మీ. ప్రజా ప్రస్థానం పాదయాత్ర పూర్తయినందుకు గుర్తుగా వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేసినట్లు చెప్పారు. అనంతరం నర్వ సమీపంలో బస ఏర్పాటు చేశారు.